మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన
– 29 కంపెనీల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు
– 1500 మంది హాజరు.. 300 మందికి ఉద్యోగాలు
– ఉద్యోగాలకు ఎంపికైన వారిని అభినందించిన చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి
కల్లూరు : నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. రాయలసీమ జిల్లాలతోపాటు తెలంగాణ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 1500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మేళాలో 29 కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో సుమారు 300 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లా చరిత్రలో మెగాజాబ్ మేళా నూతన అధ్యాయాన్ని సృష్టించిందన్నారు.
సీమ నిరుద్యోగలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన వారు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆంప్లస్, ఇన్‌ఫోసిస్ గ్రూపు ఆఫ్ ఇంజనీర్స్ సర్వీస్, హెచ్‌ఐఈఈ, కాన్‌రాడ్ లైటింగ్ సొల్యూషన్స్, యాక్సిస్ బ్యాంకు, విప్రో, ద రైజ్ సొల్యూషన్స్, డాక్టర్ రెడ్డీస్, స్వాగతం రీసోర్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, జీమూంబా ప్రైవేట్ లిమిటెడ్, ధనుష్ ఇంజనీరింగ్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర 29 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. నియామక ఉత్తర్వులు పొందిన వారు వెంటనే ఉద్యోగాల్లో చేరాలని, ఒక్కొక్కరికి కంపెనీని బట్టి సుమారు రూ.38 వేల వరకు నెలసరి వేతనం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ తిమ్మయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.