ఉద్యమ స్వరూపం
♦ ‘తెలంగాణ రాష్ట్రోదయం’ పుస్తకంపై వక్తలు
♦ భవిష్యత్‌కు బాటలు వేశారంటూ కోదండరామ్‌కు కితాబు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి, దానికి ప్రజల ఉద్యమ స్వరూపాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ అని పలువురు వక్తలు కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన మలుపులు, ప్రజా ఉద్యమ నిర్మాణ క్రమాన్ని వివరిస్తూ ఆయన రాసిన ‘తెలంగాణ రాష్ట్రోదయం’ పుస్తకం భవిష్యత్తు తెలంగాణకు మార్గదర్శి కాగలదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ రాసిన ‘తెలంగాణ రాష్ట్రోదయం’ పుస్తకావిష్కరణ బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఆయన గురువు ప్రొ. రమా మెల్కొటె ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
రచయత జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్ పాత్రికేయులు మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యవంతులను చేయడం వల్ల తెలంగాణ ఉద్యమానికే కాకుండా భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి కూడా కోదండరామ్ బాటలు వేశారని అన్నారు. కోదండరామ్ తన విద్యార్థే అయినా.. తెలంగాణ ఉద్యమంలో తాను ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నానని ప్రొఫెసర్ రమా మేల్కొటే అన్నారు. ఎంతో సహనంతో ఉద్యమాన్ని నిర్మించి విజయతీరాల వరకు నడిపించారని చెప్పారు.
పార్టీలకు అతీతంగా ఆయన ఇప్పటికీ ప్రజా ఉద్యమాల్లోనే కొనసాగడం సంతోషదాయకమన్నారు. పుస్తకంలో వచ్చిన మొదటి వ్యాసం 1998 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న సమస్యల గూర్చి రాసినట్లు కోదండరామ్ వెల్లడించారు. వ్యవసాయానికి, సాగునీటి రంగానికి జరిగిన అన్యాయం, పర్యావరణ పరిస్థితులకు ఉండే ప్రత్యేకతలను విస్మరించి సీమాంధ్ర పాలకులు తమ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని మార్చుకున్నారని అన్నారు. రాష్ట్ర సాధనలో తలెత్తిన రాజకీయ సంక్షోభం, ప్రభుత్వాలు అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు వంటి అంశాలను పుస్తకంలో వివరించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావాలంటే ముందు సీమాంధ్ర ఆధిపత్యం పోవాలని.. అలా అనుకునే ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లామన్నారు. తెలంగాణ సమాజం పైనే గత 40 ఏళ్లుగా తన అధ్యయనం కొనసాగుతోందని చెప్పారు. ఒక ప్రత్యామ్యాయ అభివృద్ధి నమూనాగా తెలంగాణను రూపొం దించుకోవలసి ఉందన్నారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఎక్కువ దృష్టి పెట్టాలని అన్నారు. మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ దశాబ్దకాలంగా తెలంగాణ ప్రజల్ని అర్ధం చేసుకునే కరదీపిక ఈ పుస్తకమని అన్నారు.