‘డాక్టర్’ మారితే మేలు
► సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కోదండరాం వ్యాఖ్య
► పాలకుల ఇష్ట ప్రకారం కాదు.. ప్రజలకు తగ్గ పాలన ఉండాలి
► భూ నిర్వాసితుల హక్కుల పరిరక్షణకు 29న ధర్నా
► తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం
► రాజకీయ నేతలను లోకాయుక్త పరిధిలోకి తేవాలి
► ఫిరాయింపుల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ‘పాలకుల ఇష్ట ప్రకారం కాదు, ప్రజల అవసరాలకు తగినట్టుగా పరిపాలన ఉండాలి. ఒక డాక్టరు మందు ఇవ్వకుంటే ఇంకొక డాక్టర్ దగ్గరకు పోకుండా ఉంటమా? ఇప్పుడున్న డాక్టరు వైఖరిని మార్చుకుంటారని ఆశిస్తున్నా. డాక్టరు వైఖరి మారకుంటే ఏమైతదో మీరే చూస్తరు’అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది. కోదండరాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకున్నారు. ప్రజా సమస్యలు, వివిధ అంశాలపై భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవడంలేదని, ప్రజలు పార్టీలకతీతంగా పునరంకిత ఉద్యమానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేసుకుంటున్నామని, సామాజిక తెలంగాణ కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించారు. అవసరమైతే ఎంత పెద్ద ఉద్యమాలకైనా సిద్ధమని ప్రకటించారు. ఉద్యోగులు, రైతులు, మహిళా సమస్యలపై కచ్చితంగా నిలబడతామని స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు వ్యతిరేకంగా, 2013 చట్టానికి తూట్లు పొడిచే చర్యలకు వ్యతిరేకంగా నిర్వాసితుల హక్కుల కోసం పోరాడుతామన్నారు. నిర్వాసితుల హక్కులను కాపాడుకోవడానికి ఈ నెల 29న ధర్నా చేపడతామని ప్రకటించారు.
‘నాయకుల’ను లోకాయుక్త పరిధిలోకి తేవాలి
రాజకీయ నాయకులను లోకాయుక్త పరిధిలోకి తీసుకురావాలని కోదండరాం డిమాండ్ చేశారు. జనవరిలో విద్యా రంగ సమస్యలపై అధ్యయనంతోపాటు వివిధ కార్యక్రమాలను చేపడతామన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ఫిబ్రవరిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్చిలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై అధ్యయనం చేసి, నివేదికను ప్రజల ముందుపెడతామన్నారు. ఏప్రిల్‌లో చిన్న, సూక్ష్మ పరిశ్రమలపై అధ్యయనం, కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేయవద్దని, ప్రభుత్వ వర్సిటీలు, చిన్న పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ బకాయిలను చెల్లించాలని, హెల్త్‌కార్డులను ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని, ధాన్యం కొనుగోలుకు కృషి చేయాలని, వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు చట్టబద్ధంగా దక్కిన భూమిని గుంజుకుంటున్నారని, వారి భూములను తిరిగివ్వాలని కోరారు. మహిళలకు సాధికారత, భద్రత కల్పించాలని, ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఫిరాయింపులపై స్పీకర్‌దే బాధ్యత
సమైక్య రాష్ట్రంలో విలువల్లేని రాజకీయాలున్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనైనా విలువలతో కూడిన రాజకీయాలు ఉంటాయని ఆశించామని కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయాల్లేవని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాల్సిందేనని, ఆ బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్‌ను చట్టబద్ధం చేసి, అమలు చేయాలని డిమాండ్ చేశారు. లోకాయుక్త వ్యవస్థను పెంపొందించాలని, రాజకీయ నాయకులను దీని పరిధిలోకి తేవాలని కోరారు.
జోనల్ వ్యవస్థ రద్దుతో తీవ్ర పరిణామాలు
జోనల్ వ్యవస్థతో తీవ్ర నష్టం, నిరుద్యోగులపై తీవ్రమైన పరిణామాలుంటాయని కోదండరాం ఆందోళన వెలిబుచ్చారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదముందన్నారు. దీనిపై నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని, నివేదిక వచ్చిన తర్వాతనే జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. నిరుద్యోగాన్ని రూపుమాపడమే లక్ష్యంగా ఆర్థిక విధానాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. జేఏసీపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని తీర్మానించినట్లు చెప్పారు.
జేఏసీ నేత ముఖ్యమంత్రి అయినా..
వేదిక మీద ఉన్న జేఏసీ నేతల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అయినా.. ప్రజల సమస్యల కోసం పని చేయడానికి జేఏసీ కొనసాగుతుందని కోదండరాం స్పష్టం చేశారు. పాలకులను వ్యతిరేకించడమే జేఏసీ లక్ష్యం కాదని, ప్రజల సమస్యల కోసం పాలకులను ప్రశ్నించడానికి పునరంకితమైన సంస్థ అని తెలిపారు. జేఏసీ రాజకీయ వేదిక కాదని, జేఏసీగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమస్యలపై అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదించి, ప్రజల్లో ప్రచారం చేసిన తర్వాత సమస్య పరిష్కారం కాకుంటే అవసరమైతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. నిజాం షుగర్స్‌పై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అసంబద్ధంగా ఉందన్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, క్రమంగా రైతులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులకు పంచశీల సూత్రాలు నిర్దేశించారు.
జేఏసీ పూర్తిస్థాయి కమిటీ
ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్‌గా తెలంగాణ జేఏసీకి పూర్తిస్థాయి కమిటీని ప్రకటించారు. కన్వీనర్‌గా పిట్టల రవీందర్, కో చైర్మన్లుగా నల్లపు ప్రహ్లాద్, ఖాజా మొహీనుద్దీన్, ఇటిక్యాల పురుషోత్తం, కో కన్వీనర్లుగా బిక్షపతి, డి.పి.రెడ్డి, వి.సంధ్య, జి.శంకర్, భైరి రమేశ్, తన్వీర్ సుల్తానా, అధికార ప్రతినిధులుగా జి.వెంకట్ రెడ్డి, గురజాల రవీందర్‌రావు, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున్, ముత్తయ్య, దేశపాక శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, రామగిరి ప్రకాశ్ ఎన్నికయ్యారు. అలాగే ఎడిటోరియల్ కమిటీ, నిర్మాణ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, పబ్లిసిటీ కమిటీలను కూడా ప్రకటించారు.