టీఆర్‌ఎస్ పాలన సంతృప్తిగా లేదు
జేఏసీ చైర్మన్ కోదండరాం
భీమదేవరపల్లి: రెండేళ్లు దాటినా టీఆర్‌ఎస్ పాలన అంత సంతృప్తిగా సాగడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రచించిన ‘మా పోరాటం’ పుస్తకాన్ని శనివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబుతో కలిసి కోదండరాం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్‌లో జేఏసీ కార్యవర్గ సమావేశంలో తాము అవలంబించే విధానాలు, భవిష్యత్ కార్యచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులతో పాటుగా చేతివృత్తులు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం, విద్య సైతం పూర్తిస్థాయిలో అందడం లేదని కోదండరాం అన్నారు. ప్రజల ఇబ్బందులను జేఏసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారి పక్షాన నిలుస్తుందన్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకు మా విధానాలు చేరువ చేసేందుకు త్వరలో మాస పత్రిక, వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు.