సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేయని రైతుల రుణమాఫీ ఈ రెండు నెలల్లో చేస్తుందా? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులు అమ్ముకునేందుకు కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు క్రమంగా ప్రైవేటుపరం చేస్తున్నారని, 56 వేల మంది ఉన్న ఆర్టీసీ కార్మికుల సంఖ్య 43 వేలకు చేరిందని, బస్సుల సంఖ్య 12 వేల నుంచి మూడు వేలకు పడిపోయిందన్నారు.
ఆర్టీసీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తాత్కాలిక కార్మికుల పరిస్థితేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులకు పరిమితం చేస్తున్నారని, ఆరు నెలలకు ఒకసారి సభ జరగాలి కాబట్టి మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకునేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని. వాటిపై సభలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్న బాధితులకు తక్షణ సాయంగా రూ.25 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా.. ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తరువాతే పంటపొలాలు బ్యాక్ వాటర్ కారణంగా నష్టపోతున్నాయని ఈటల ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా సమస్య పరిష్కరించే దమ్ము లేదని, అన్నింటికీ ముఖ్యమంత్రే అని ఎద్దేవా చేశారు. మూడు నెలలైతే ఈ ప్రభుత్వం ఉండదన్నారు.
కక్షపూరితంగానే బీఏసీకి పిలువలేదు
ఉమ్మడి ఏపీలో సైతం ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీకి పిలిచేవారని, బీజేపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా పిలవకపోవడం కక్షపూరిత చర్య అని ఈటల మండిపడ్డారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి తెలంగాణ పాలకులకు లేదన్నారు. అసెంబ్లీలో చాలా రూములు ఖాళీగా ఉన్నా.. బీజేపీ సభ్యులకు కేటాయించలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment