వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలి
ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని, ప్రస్తుతం తలెత్తున్న సమస్యల పరిష్కారానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం ఎంతో అవసరమని రైతు జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. అన్నదాతకు అండగా... కదులుదాం దండిగా.. అనే నినాదంతో అక్టోబర్ 2న తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ‘మౌన దీక్ష’ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ.. రోజూ మనకు తిండి పెట్టే అన్నదాతను ఆదుకోకపోతే ఈ సమాజమే బతకలేదని, కాబట్టి అందరూ ఈ దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భూమి, నీరు, విత్తనాలపై రైతులకు హక్కు ఉండాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, రుణమాఫీ ఒకే దఫాలో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిర్లక్ష్య, నియంతృత్వ పద్ధతిలో భూసేకరణ సాగుతుందని... మల్లన్న సాగర్ విషయంలో నిరంకుశ ధోరణి ఆపాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రాజెక్టులు కట్టేందుకు ఎవరూ వ్యతిరేకం కాదు.. ఎక్కడ కట్టాలి, ఎంత కట్టాలనేదానిపై చర్చ జరగాలన్నారు. రైతు జేఏసీ ప్రతినిధులు జలపతిరావు, విస్సా కిరణ్‌కుమార్, కన్నెగంటి రవి, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి అంజిరెడ్డి, టీజేఏసీ నేత పిట్టల రవీందర్, శ్రీధర్‌రెడ్డి, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.