ప్రకృతి..వికృతి
ప్రకృతి..వికృతి
Published Mon, Feb 27 2017 12:10 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM
- ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇవ్వని ప్రభుత్వం
- శిక్షణల పేరుతో రూ.50 లక్షలకు పైగా వృథా వ్యయం
- దేశవాళి ఆవులు లేవు.. ఎన్‌పీఎం షాపులూ లేవు
- ప్రభుత్వ చర్యలతో నీరుగారుతున్న రైతుల ఉత్సాహం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయం పేరుతో ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే రైతులకు మాత్రం ఎలాంటి చేయూత ఇవ్వడం లేదు. వ్యవసాయ సీజన్ ముగిసినా 2016–17 సంవత్సరానికి సంబంధించి ప్రోత్సాహకాలు అందించలేదు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై జిల్లాలో రైతులు ఆసక్తి చూపుతున్నారు. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా 100 మంది అన్నదాతలు అద్భుత దిగుబడులు సాధిస్తున్నారు. ఈ విషయం తెలిసి ప్రభుత్వం కూడా రైతులను ప్రోత్సహించేందుకు పూనుకుంది. జిల్లాలోని ఏడు మండలాల్లో 11 క్లస్టర్లు ఏర్పాటు చేసింది. ఒక్కో క్లస్టర్‌లో 300 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టింది. జిల్లా స్థాయిలో డీపీఎం, క్లస్టర్‌కు ఒక అసిస్టెంట్‌ను నియమించింది. ఆత్మ సిబ్బంది కూడా ప్రకృతి వ్యవసాయం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రైతులకు చేయూత ఇవ్వాల్సింది ఇలా....
ప్రకృతి వ్యవసాయంలో దేశవాళి ఆవు కీలకం. ఆవు మూత్రం, పేడలతో ద్రవ, ఘన జీవామృతాలు తయారు చేసుకుంటారు. ప్రతి క్లస్టర్‌కు 30 దేశవాళి ఆవులు సబ్సిడీపై పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్కో ఆవుకు ప్రభుత్వం రూ.10వేలు సబ్సిడీ ఇస్తుంది. ప్రతి క్లస్టర్‌లో ఐదు ఎపీఎం షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. రైతులు.. జీవామృతం, ఇతర కషాయాలను స్వంతంగా తయారు చేసుకోలేకపోతున్నందున నామమాత్రపు ధరలతో వీటిని పంపిణీ చేయాలనే ఎన్‌పీఎం షాపులను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి రూ.50వేలు ప్రకారం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో సాంకేతికత జోడించేందుకు ప్రతి క్లస్టర్‌కు ఒక కస్టమ్ హయరింగ్ సెంటరును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో రోటోవేటర్ తదితర ఆధునిక వ్యవసాయ పరికరాలు ఉంటాయి. వీటికి రూ.5 లక్షలు సబ్సిడీ ఇస్తుంది.
అందని ప్రోత్సాహకాలు..
వ్యవసాయశాఖ.. ప్రకృతి వ్యవసాయానికి 2015–16లోనే ప్రణాళికలను సిద్ధం చేసుకొని 2016–17లో అమలులోకి తీసువచ్చింది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్ కూడా పూర్తి అయింది. 2017–18 వ్యవసాయ సీజన్‌కు కూడ రైతులు సిద్ధం అవుతున్నారు. కాని 2016–17 సంవత్సరానికి సంబంధించి రైతులకు అందించిన ప్రోత్సాహం సున్నానే... దేశవాళి ఆవులు లేవు, ఎన్‌పీఎం షాపుల జాడే లేదు. కస్టమ్ హయరింగ్ సెంటర్లు లేవు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తారో వ్యవసాయ యంత్రాంగానికే తెలియాలి. ప్రతి క్లస్టర్‌లో 300 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయ చేపట్టాలని నిర్ణయించినా అది సాధ్యం కాలేదు. వచ్చే ఏడాది ఇవే క్లస్టర్లలో 750 మంది రైతులతో ఈ వ్యవసాయం చేపట్టాలని నిర్ణయించారు. ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వకపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు.
శిక్షణలకు రూ.50 లక్షల పైమాటే...
క్షేత్ర స్థాయిలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకపోయినా.. శిక్షణల పేరుతో అడ్డుగోలుగా నిధులు వ్యయం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇందుకు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ప్రతి నెలా ప్రకృతి వ్యవసాయం పేరుతో శిక్షణ కార్యక్రమాలు జరుగుతునే ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో రైతులకు మాత్రం చేయూత కరువు అవుతోంది.
చర్యలు తీసుకుంటాం: నాగరాజు, డీపీఎం
దేశవాళి ఆవులు కొనుగోలు చేసినట్లు పశువైద్యులు, ఏడీఏలు ధ్రువీకరించాల్సి ఉంది. వీరి దగ్గరి నుంచి తగిన నివేదికలు వస్తే సబ్సిడీ విడుదల చేస్తాం. ఎన్‌పీఎం షాపుల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. 2016–17కు సంబంధించి మాత్రం ఇంతవరకు రైతులకు సబ్సిడీలు విడుదల కాలేదు. ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
Advertisement
Advertisement