భూసేక’రణం’
భూసేక’రణం’
Published Fri, Jan 27 2017 10:57 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం
సర్కారు తీరిది
జిల్లాలో వివాదాస్పదమవుతున్న భూముల సేకరణ
చింతలపూడి ఎత్తిపోతలపై తెగని వివాదం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
జిల్లాలో ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణకు ప్రభుత్వం ఒక్కొక్క చోట ఒక్కో విధానం అవలంబిస్తోంది. పరిశ్రమలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం బహుళ పంటలు పండే భూములను ప్రభుత్వం లాగేసుకుంటోంది. దీంతో రైతులు, రైతు కూలీలు, జీవనోపాధి దెబ్బతిని బతుకుదెరువు కోల్పోతున్నారు. భూసేకరణ వల్ల భూములు కోల్పోతున్న రైతులు, గ్రామాలను ఖాళీ చేసి వెళ్తున్న నిర్వాసితులు, న్యాయస్థానాల్లో కేసులు వేసి ప్రభుత్వ తీరును, భూ సేకరణ విధానాన్ని ప్రశ్నిస్తున్నా పాలకుల వైఖరి మారడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ చింతలపూడి ఎత్తిపోతల పథకం. చింతలపూడి మండలం ప్రగడవరం, తిమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లో కాలువ తవ్వకాలకు అవసరమైన భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం ప్రాథమిక ప్రకటన ఇచ్చింది. ప్రగడవరం గ్రామానికి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ 21న భూసేకరణ చట్టం 2013లోని సెక‌్షన్ 11(1) ప్రకారం ప్రాథమిక ప్రకటన జారీ అయ్యింది. అనంతరం సెక‌్షన్ 11(2) ప్రకారం పంచాయతీ గ్రామసభ నిర్వహించలేదు. గ్రామసభ నిర్వహించి.. తదనుగుణంగా భూసేకరణ ప్రతిపాదనలను ఆమోదించాని చట్టం స్పష్టం చేస్తోంది. ప్రగడవరం గ్రామంలో భూములు కోల్పోతున్న రైతు గోలి రామకృష్ణారెడ్డి గ్రామసభ కోసం పంచాయతీ కార్యదర్శిని అడగ్గా.. భూసేకరణ అధికారులు ఏవిధమైన గ్రామసభలు నిర్వహించ లేదనే సమాధానం వచ్చింది. ఇదే కాలువ కోసం తిమ్మిరెడ్డిపల్లిలో భూములు సేకరిస్తున్నట్టు సెప్టెంబర్ 24న ప్రకటన ఇచ్చారు. ఇక్కడా గ్రామసభ నిర్వహించలేదు. అవార్డు ఎంక్వైరీలోనూ ఎటువంటి నిబంధనలు అమలు చేయలేదు. ఽగ్రామసభ ఆమోదం లేని భూసేకరణ ప్రక్రియ చెల్లదు. భూసేకరణ చట్టం2013లోని సెక‌్షన్లు 16, 17, 18 ప్రకారం భూసేకరణ వల్ల ఎంతమంది భూములు కోల్పోతున్నారు, ఇందులో ఎంతమంది బాధితులవుతున్నారు, ఎంతమంది ఎస్సీ, ఎస్టీలున్నారు, ఎంతమంది డీఫారం పట్టా సాగుదారులున్నారు, ఎంత మందికి భూమికి భూమి కింద ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, భూమి విలువను మార్కెట్ ధర ప్రకారం నిర్ణయించారా లేదా అనే పూర్తి వివరాలను సెక‌్షన్ 19(1) ప్రకారం సేకరించాల్సి ఉంటుంది.
ఒక్కొక్క చోట ఒక్కో ధర
టి.నరసాపురం మండలం బండివారిగూడెంలో ఎకరాకు రూ.14 లక్షలు చెల్లించగా.. దాని సరిహద్దు రెవెన్యూ గ్రామం కృష్ణాపురంలో రూ.15లక్షల నుంచి రూ.21 లక్షలు చెల్లించారు. చింతలపూడి మండలం కొమ్ముగూడెంలో ఎకరాకు రూ.21 లక్షలు చెల్లిస్తే దాని సరిహద్దు రెవెన్యూ గ్రామైన యర్రగుంటపల్లిలో ఎకరాకు రూ.12.50 లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారు. పక్కనే ఉన్న తీగలవంచ గ్రామంలో ఎకరాకు రూ.19 లక్షలు, చింతలపూడిలో ఎకరానికి రూ.15 లక్షలు ఇస్తున్నారు. ప్రగడవరం కంటే కొమ్ముగూడెం, కృష్ణాపురం గ్రామాల భూములు ఏ విధంగా విలువైనవని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక సిఫార్సుతో పెదవేగిలో ఎకరాకు రూ.31 లక్షలు చెల్లించగా, ఏపూరులో ఎకరాకు రూ.44.90 లక్షలు ఇచ్చారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో ఎకరాకు రూ.52.90 లక్షలు చెల్లించారు. భూమిలో ఉన్న పంట, చెట్లు, ఆయిల్‌పామ్ తోటలకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపు విషయంలోనూ ఇదే వివక్ష పాటిస్తున్నారు.
అంతా గందరగోళమే
చింతలపూడి ఎత్తిపోతల పథకం మొత్తం గందరగోళంగా తయారైంది. 2008లో జల వనరుల శాఖ ప్రతిపాదనల ప్రకారం ఈ ఎత్తిపోతల పథకానికి రూ.1,701 కోట్లు వెచ్చించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు, 230 గ్రామాలకు తాగునీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిర్మాణం పూర్తయితే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 15 మండలాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. జీలుగుమిల్లి మండలంలో 8 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ కట్టాలని నిర్ణయించారు. దీనివల్ల బుట్టాయిగూడెం మండలం బెడదనూరు, జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురం, బొత్తప్పగూడెం, జిల్లెళ్లగూడెం ముంపునకు గురవుతాయి. మరో నివేదికలో 12 గ్రామాలు నష్టపోతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ వి«షయాన్ని మాత్రం అధికారులు రహస్యంగా ఉంచారు. ఈ ప్రాజెక్ట్ కోసం రెవెన్యూ భూమి 1,282.45 హెక్టార్లు, అటవీ భూమి 2,704.59 హెక్టార్లు సేకరరించాల్సి ఉంది. కాలువ తవ్వకాలు ప్రారంభించినా భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం మాత్రం జరగలేదు. మరోవైపు ఫేజ్2 పనులు ప్రారంభించేందుకు రూ.3,208 కోట్లు కేటాయించాలని కోరుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్టు మంత్రులు ప్రకటించారు. దీనివల్ల 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, నూజివీడు, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలోని సాగర్ ఆయకట్టుకు నీరు తీసుకువెళతామని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ సెలవిచ్చారు. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచాలని యోచిస్తున్నారు. 8 టీఎంసీలకే 4 గ్రామాలు ముంపునకు గురైతే.. పెంచిన 12 టీఎంసీల వల్ల ముంపు గ్రామాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ గ్రామాలు ఏవి, వాటికి భూమికి భూమి, పునరావాస కాలనీలు ఎక్కడ నిర్మిస్తారన్నది ఇప్పటివరకూ బయటపెట్టలేదు. మళ్లీ జల వనరుల శాఖ జీఓ నంబర్ 94 ద్వారా రూ.4,909 కోట్ల నిధులు వెచ్చించేందుకు పరిపాలనా అమోదం వచ్చిందని, ఈ పనులు పూర్తి చేసి 4.72 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆ శాఖ మంత్రి ప్రకటించారు. అసలు ఆయకట్టు ఎంత వస్తుందనేది ఇప్పటికీ అ«ధికారులకు స్పష్టత లేని పరిస్థితి.
Advertisement
Advertisement