తెలుగుదేశం ప్రభుత్వానికి రైతు శ్రేయస్సు పట్టడం లేదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విమర్శించారు.
రైతు శ్రేయస్సు పట్టని ప్రభుత్వం
Sep 23 2016 1:21 AM | Updated on Oct 1 2018 2:44 PM
– అన్నదాతలకు అండగా భరోసా యాత్ర
– 28, 29 తేదీల్లో జగన్ పర్యటన
– ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
ఆలూరు రూరల్: తెలుగుదేశం ప్రభుత్వానికి రైతు శ్రేయస్సు పట్టడం లేదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విమర్శించారు. గురువారం ఆయన వైఎస్సార్ సీపీనాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28, 29వ తేదీల్లో ఆలూరు నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారని, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. సర్వస్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాల దీన పరిస్థితులను తెలుసుకునేందుకు తమపార్టీ అధినేత రైతు భరోసా యాత్రను చేపట్టారని వివరించారు. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి ఉల్లికి గిట్టుబాటు ధర కల్పిస్తూ స్థానికంగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారన్నారు. సంబంధితశాఖ అధికారులు ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. ఆలూరులో మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని క్వింటాకు రూ.12 వేలు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే వెంట ఆయన సోదరుడు శ్రీను, ఆస్పరి మండల సీనియర్ నాయకులు దత్తాత్రేయరెడ్డి, కన్వీనర్ దొరబాబు, గోవర్దన్, కేశవరెడ్డి, మైలార్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement