మన్ననూర్(మహబూబ్‌నగర్‌జిల్లా) : రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలంటికి ప్రభుత్వమే భాధ్యత వహించాలని వైఎస్సార్ పార్టీ జిల్లా నాయకులు కొండూరు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా మన్ననూర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. పంటలకు అనూకూలించని వాతావరణం, కరెంటు కోతలు, నకిలీ విత్తనాలు, విపత్కర పరిస్థితుల్లో సాగుచేస్తూ పంటల పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్రాబాద్ మండలం బీకే తిర్మలాపూర్ గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన కొయ్యల చక్రపాణికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేసియాతో పాటు ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. మండలంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో వేసిన పత్తి, మొక్కజొన్న పంటలు ఆశించిన దిగుబడి రాక పెట్టుబడులు మీదపడినట్లు వాపోయారు. ఈ పరిస్థితుల్లో అమ్రాబాద్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి పంట నష్ట పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.