అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
రైతు సమస్యలపై చర్చించాలి: పొంగులేటి
సాక్షి ప్రతినిధి ఖమ్మం/హన్మకొండ: రైతుల ఆత్మహత్యలను నివారించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. విపక్షాలు పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా శనివారం వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఆందోళనల్లో ఆయన పాల్గొన్నారు. హన్మకొండలో పొంగులేటి నేతృత్వంలోని బైక్‌ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. అక్కడ కూడా సీపీఎం, బీజేపీ నాయకులతో కలసి పొంగులేటి నిరసన వ్యక్తం చేశారు.
ఖమ్మం బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన రాస్తారోకోలో, బైక్ ర్యాలీలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల పొంగులేటి మాట్లాడారు. రైతుల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే ఎక్స్‌గ్రేషియాతో ఆ కుటుంబాలను ఆదుకోవచ్చుగానీ, ఆత్మహత్యలను ఆపలేమన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని పొంగులేటి గుర్తుచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర నాయకుడు మునిగాల విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు.