
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన, కరోనా ప్రభావంతో ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం వర్చువల్‌గా ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కావాల్సి ఉందని, వాల్తేరు డివిజన్‌ను కొనసాగిసూ్తనే ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు పనులను పూర్తి చేయాలన్నారు.
► పార్లమెంట్ ఉభయ సభలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలు, కౌన్సిళ్లు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సవరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరారు.
► వ్యవసాయ ఉత్పత్తులకు రైతు గిట్టుబాటు ధర పొందే హక్కును చట్టబద్ధం చేయాలని కోరారు.
► ఇటీవల ఏపీలో వరుసగా జరిగిన ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ నాయకులున్నట్టుగా సీసీ టీవీ పుటేజీల ఆధారంగా వెల్లడైందన్నారు.
► మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల కేసులను త్వరితగతిన పరిష్కరించేలా ఐపీసీ, సీఆర్‌పీసీలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ తెచ్చిన దిశ చట్టం 21 రోజుల్లో పరిష్కరించే వీలు కల్పించిందన్నారు.
► విశాఖలో జాతీయ ప్రాధాన్యం కలిగిన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు.