పోడియం వద్ద ఆందోళన చేస్తున్న సభ్యులు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తొలిరోజైన సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వేడిపుట్టించారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలంటూ ఉభయ సభల్లోనూ నినాదాలు హోరెత్తించారు. లోక్‌సభ, రాజ్యసభలను దాదాపు స్తంభింపజేసేలా పెద్దఎత్తున ఆందోళన చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలను డిమాండ్ చేస్తూ లోక్‌సభలో.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు తీవ్రస్థాయిలో నిరసన గళమెత్తారు. ఈ విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలంటూ వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటినీ పక్కనపెట్టి రూల్–267 కింద ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చను ప్రారంభించాలని అందులో కోరారు. ఈ అంశం ఎందుకు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విజయసాయిరెడ్డి తన నోటీసులో క్లుప్తంగా ఇలా వివరించారు.. ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలు ప్రకటించారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి ప్రధానమైంది. ప్రధాని ఇచ్చిన ఈ హామీని 2014 మార్చి 1న జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కానీ, ఇది జరిగి ఏడేళ్లు దాటినా ఈ హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్ చేసి సభలో తక్షణమే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి’’.. అని విజయసాయిరెడ్డి ఆ నోటీసులో డిమాండ్ చేశారు.
పోడియం వద్దకు ఎంపీలు
ఆ తర్వాత హోదా అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ రాజ్యసభలో పోడియం వద్దకు వెళ్లి వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన చేశారు. కానీ, రూల్–267 కింద విజయసాయిరెడ్డి ఇచ్చిన నోటీసుతోపాటు విభిన్న అంశాలపై ఇతర పార్టీల సభ్యులిచ్చిన 17 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో విజయసాయిరెడ్డి, ఇతర సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అనంతరం విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ.. ‘మీ నోటీసులో ప్రస్తావించిన ప్రత్యేక హోదా అంశం చర్చకు అర్హమైనదే. కానీ, ఈ రోజు చర్చకు అనుమతించలేను’.. అని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేయాలని పోడియం వద్ద నినదించారు. సభ వాయిదా పడి ప్రారంభమైన ప్రతీసారి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఇలా పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ఇదే సమయంలో సభలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఆందోళనను మౌనంగా వీక్షిస్తూ కనిపించారు.
కామర్స్ కమిటీకి అభినందనలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కామర్స్ పార్లమెంటరీ స్థాయీ సంఘం పనితీరును ప్రశంసిస్తూ సోమవారం రాజ్యసభలో చైర్మ¯న్ ఎం. వెంకయ్యనాయుడు అభినందించారు. పార్లమెంట్ సమావేశాల విరామ కాలంలో వివిధ స్థాయీ సంఘాల పనితీరును విశ్లేషించిన ఆయన.. కామర్స్ కమిటీ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని ప్రశంసించారు. పార్లమెంట్ విరామ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమై 15 గంటల 51 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చలు జరిపిందని చైర్మన్ తెలిపారు. కమిటీ మొత్తం జరిపిన సమావేశాల్లో 31 శాతం ఈ కాలవ్యవధిలోనే నిర్వహించడంపట్ల ఆయన కమిటీ చైర్మన్, సభ్యులను అభినందించారు.
పోలవరంపై లోక్‌సభలో ప్లకార్డుల ప్రదర్శన
విభజన హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పెట్టుబడి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని, ఈ అంశంపై చర్చించేందుకు వీలుగా సభా కార్యకలాపాలు వాయిదా వేయాలని కోరుతూ వాయిదా తీర్మానానికి వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి సభాపతి ఓం బిర్లాకు నోటీసులిచ్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్–90 ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టని కేంద్రం ప్రకటించిందని, అన్ని అనుమతులు తీసుకునేందుకు, ప్రాజెక్టు అమలుచేసేందుకు ఈ చట్టం ద్వారా కేంద్రానికి బాధ్యతలను దఖలుపరిచిందని మిథున్‌రెడ్డి తన నోటీసులో ప్రస్తావించారు. ఏడేళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టుకు తగిన స్థాయిలో నిధులు విడుదల చేయడంలేదని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సిఫారసు మేరకు రూ.55,656.87 కోట్లకు కేంద్ర ఆర్థిక శాఖ పెట్టుబడి అనుమతులు ఇవ్వాల్సి ఉందని గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment