
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభలో రెండో రోజు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై నోటీసు ఇచ్చారు. పోడియం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్లకార్డుతో ఆందోళన తెలిపారు. పోలవరానికి నిధుల విడుదల, పెగాసస్ డేటాలీక్ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ, విపక్ష ఎంపీల నిరసనలతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.
అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్గాని భరత్ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యేక హోదా అత్యంత ప్రాధాన్యత గల అంశం. దీనిపై చర్చ కోసం రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని డిమాండ్ చేశాం’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
‘‘పోలవరం ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. పోలవరం సవరించిన అంచనాలు వెంటనే ఆమోదించాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం’’ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.
‘‘విభజన చట్టం ప్రకారం పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆమోదిస్తేనే నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయగల్గుతాం. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో విజయసాయిరెడ్డి పోరాడుతున్నారు.రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న వెంకయ్యే గతంలో ఏపీకి పదేళ్లు హోదా ఇవ్వాలన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్రానిదే’’ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు.