Bishweswar Tudu On Sanction Of Rs 12,911 Crore For Polavaram Project In Rajya Sabha - Sakshi
Sakshi News home page

పోలవరం తొలిదశ పూర్తికి 12,911 కోట్లు.. ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌

Published Mon, Jul 24 2023 5:23 PM | Last Updated on Mon, Jul 24 2023 5:47 PM

Bishweswar tudu On Sanction 12911 Crore For Polavaram Project Rjyasabha - Sakshi

న్యూఢిల్లీ: పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ తొలిదశలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి అదనంగా రూ. 12,911 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం ఆమోదం తెలిపినట్లు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబు చెప్పారు.

పోలవరం ప్రాజెక్ట్‌ తొలిదశ కింద చేపట్టిన నిర్మాణాల్లో మిగిలిన పనులు పూర్తి చేసి 41.15 మీటర్ల వరకు నీటిని నిలువ చేసేందుకు 10 వేల 911.15 కోట్ల రూపాయలు, వరదల కారణంగా దెబ్బతిన్న నిర్మాణాల మరమ్మతుల కోసం మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి తమకు అభ్యంతరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం గత జూన్‌ 5న తెలిపిందని పేర్కొన్నారు. పోలవరం నిధులకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం తాజా ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉందని మంత్రి వివరించారు.

పోలవరం తొలిదశ నిర్మాణంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి సవరించిన అంచనాల ప్రకారం రూ. 17,144 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత జూన్‌ 5న తమకు ప్రతిపాదనలు సమర్పించిందని మంత్రి తెలిపారు. వీటిని త్వరితగతిన పరిశీలించి ప్రభుత్వ ఆమోదం పొందేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

అయితే ఈ ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కోరడం సబబు కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయంకు సంబంధించి మార్చి 15, 2022న రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల ప్రాతిపదికన తక్షణం 10 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జూలై 15, 2022న రాసిన లేఖను కూడా ఆర్థిక శాఖ వ్యయ విభాగం పరిగణలోకి తీసుకున్న పిమ్మటే మొత్తం 12,911 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement