సాక్షి, ఢిల్లీ: పోలవరం హెడ్ వర్క్స్ డిజైన్లలో జరిగిన మార్పుల వలన హెడ్ వర్క్స్ వ్యయం 5,535 కోట్ల నుంచి 7,192 కోట్లకు పెరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ పోలవరం హెడ్ వర్క్స్‌లో డిజైన్ల మార్పు కారణంగా పెరిగిన అదనపు వ్యయాన్ని కేంద్రం భరించేది, లేనిది సూటిగా చెప్పకుండా జవాబును దాట వేశారు. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ పనులకు అంచనా వేసిన వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే. నిర్మాణ ప్రణాళికతో పాటు ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. ప్రాజెక్ట్ డిజైన్లు గోదావరి జలాల ట్రైబ్యునల్ నియమ, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవో లేదో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించి ఆమోదించిన మీదటే వాటిని ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని మంత్రి షెకావత్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ప్రాజెక్ట్‌లోని కొన్ని అంశాలకు సంబంధించిన డిజైన్లను సీడబ్ల్యూసీ మార్పులు చేసింది. మార్పుల కారణంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల ఎత్తు పెంచడం, పునాదుల లోతు పెంచడం, స్పిల్‌వేలోని అత్యంత లోతైన బ్లాకులలో కాంక్రీట్ గ్రేడ్‌ల పెంపు, ఎగువ కాఫర్ డామ్‌లో ఎడమ వైపు డయాఫ్రం వాల్‌తో కటాఫ్ నిర్మాణం, గేట్ గ్రూవ్స్‌లో చిప్పింగ్ పనులు, స్పిల్‌వేలో రెండో దశ కాంక్రీట్ పనుల నిర్వహణ పనులను అదనంగా చేపట్టవలసి వస్తోందని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment