
ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,805 కోట్ల బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సమావేశాల సందర్భంగా మంగళవారం విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్రం నుంచి నిధుల కోసం చూడకుండా ప్రభుత్వం సొంతంగాఖర్చు చేస్తోందన్నారు.
కేంద్రం నుంచి రూ. 3,805 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, దీనికి సంబంధించి కాగ్ ఆడిట్ కూడా పూర్తయిందన్నారు. పోలవరంకు సంబంధించి బకాయిలు విడుదల చేయాలని సీఎం జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే 2021 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. వెంటనే పోలవరంకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. రాష్ట్ర ఆర్ధిక మంత్రితో బకాయిల చెల్లింపులపై చర్చలు జరుపుతున్నామన్నారు. కాగ్ సర్టిఫికేషన్ వల్ల నిధుల విడుదల ఆలస్యమైందన్నారు. వీలైనంత త్వరగా పోలవరం బకాయిలను విడుదలయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు.(చదవండి : పోలవరం.. మీ సహకారంతో సాకారం)
Comments
Please login to add a commentAdd a comment