కవాడిగూడ: ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదని, వారికి కావాల్సిన తెలంగాణ కోసం మరో ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని, మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారులు, పలు పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఆదివారం కవాడిగూడ డివిజన్‌లోని పింగళి వెంకట్రామ్‌రెడ్డి హాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న సందర్భంగా ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆలింగనం చేసుకున్నారు.
ఇది అందరి తెలంగాణ..
టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ‘త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ ఎవరి జాగీరు కాదు, సీఎం కేసీఆర్ ఒక్కరే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని అనుకుంటు న్నారు, ఇది కేవలం నీ తెలంగాణ కాదు.. ఇది అందరి తెలంగాణ’ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో నౌకరీ దొరకడం లేదన్నారు. తెలంగాణకు చెందిన ప్రతీ పైసా తెలంగాణ బిడ్డలకే దక్కాలన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని, స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో పోస్టర్ ఆవిష్కరిస్తున్న కోదండరాం, బాలక్రిష్ణారెడ్డి, మహేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్, ఎంపీ మధుయాష్కి, ప్రభాకర్, చెరుకు సుధాకర్, రాములునాయక్ తదితరులు
అడిగి తెచ్చుకోలేదు..
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కళాకారుల ఆటపాటతో అన్ని వర్గాల ప్రజల వద్దకు తెలంగాణ ఉద్యమం చేరిందన్నారు. ఇది అడిగి తెచ్చుకున్న తెలంగాణ కాదు, త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు చేసి సాధించుకుందన్నారు. తెలంగాణఫలాలు సబ్బండ ప్రజలకు దక్కేలా నిర్మాణాత్మమైన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అన్యాయాలపై, పాలనపై ఏపూరి సోమన్న తనదైన శైలిలో గళమెత్తారు. సమ్మేళనం కన్వీనర్ జిట్టా బాలక్రిష్ణారెడ్డి, కో–ఆర్డినేటర్ కె.కె.మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, వివేక్, రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, డా.చెరుకు సుధాకర్ మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మాజీ ఎంపీ మధుయాష్కి, యువతెలంగాణ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీరుద్రమదేవి, వివిధ జిల్లాల ఉద్యమకారులు పాల్గొన్నారు.
ప్రజాతెలంగాణ కోసం మరో ఉద్యమం
Published Mon, Sep 16 2019 2:41 AM | Last Updated on Mon, Sep 16 2019 2:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment