
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గాన్ని విస్తరించడం సంతోషకరమని, అయితే మంత్రివర్గంలో మహిళలలకు, ఎస్టీలకు స్థానం లేకపోవడం బాధాకరమని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారు ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నానన్నారు. గతంలో కూడా మహిళా మంత్రి లేకుండానే ప్రభుత్వం నడిచిందని, ప్రతిపక్షాలు ఎంత చెప్పినా సీఎం పట్టించుకోలేదని అన్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎంను ఉల్లంఘించి అప్పులు చేస్తోందని, కేంద్ర పథకాలకు అడ్డుకట్ట వేయడం వంటి అంశాలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లామని దత్తాత్రేయ తెలిపారు. కొత్త రాష్ట్రం అయినందున ఎక్కువ నిధులను కేటాయించాలని, హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరామన్నారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీసీల ఆత్మగౌరవ సభ పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు.