సాక్షి, హైదరాబాద్ : ప్రజల ప్రభుత్వం కోసం ప్రగతిభవన్ గడీలను బద్దలు కొడదామని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ఎం.కోదండరాం పిలుపునిచ్చారు. పాలపిట్ట, ఆకుపచ్చ రంగులతో రూపొందించిన టీజేఎస్ జెండాను బుధవారం హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలపిట్టకు అపజయం తెలియదన్నారు. ‘‘పాలపిట్ట రంగును అద్దుకున్న టీజేఎస్ ఎక్కడైనా విజయం సాధిస్తుంది. స్వరాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉంటుందనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలాగా పాలిస్తున్నాడు. బాధితులు న్యాయం కోసం పోరాటం చేస్తే అరెస్టులు చేశారు.
భావ వ్యాప్తి కోసం, ప్రజలకు న్యాయం చేయడం కోసం పార్టీ అవసరం. ఇప్పటిదాకా 99 శాతం నడిచాం. ఇంకా ఒక్క శాతం మిగిలి ఉంది. 1996 నుంచి ఆచార్య జయశంకర్ సార్‌తో తెలంగాణ ప్రయాణం ప్రారంభించాం. అవే ఆశయాలను కచ్చితంగా సాధించి తీరుతాం’’అని అన్నారు. రాష్ట్ర ప్రజల బాగుకోసమే టీజేఎస్ పుట్టిందని స్పష్టంచేశారు. ఈ నెల 29న బహిరంగసభతో తమ బలమేంటో చూపిస్తామని పేర్కొన్నారు. సైకిల్‌తో బయల్దేరిన కాన్షీరాం, చీపురు చేతబట్టిన కేజ్రీవాల్ రాజ్యాధికారం సాధించలేదా అని ప్రశ్నించారు.
పాలనలో మార్పు కోసమే..
ఇది తెలంగాణ ప్రజాస్వామికీకరణకు, ఏకవ్యక్తి పాలనకు మధ్య జరుగుతున్న పోరాటమని కోదండరాం అన్నారు. ఉద్యమంలో గెలిచామని, ఓట్ల పండుగలోనూ గెలుస్తామని చెప్పారు. ‘‘కేవలం పాలకుల్లో మార్పు మాత్రమే కాదు. పాలనలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఈ నెల 29 నాటికి జన సమితి ప్రతీ ఇంటికి వెళ్లాలి. తాడు, బొంగరం లేదని కొందరు మాట్లాడుతున్నారు. ఆ బొంగరం ఎట్లా గిరాగిరా తిరుగుతుందో చూపించాలి’’అని పిలుపునిచ్చారు. ఈ నెల 29 దాకా సన్నాహక కమిటీలు పనిచేస్తాయని, ఆ తర్వాత తాత్కాలిక కమిటీలు ఏర్పాటు చేసుకుంటామని వివరించారు.
ఇక నుంచి ఏ సంఘాలు ఉండవని, అందరూ జన సమితిగానే ఉంటారని పేర్కొన్నారు. ‘‘ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వారికే జన సమితిలో ప్రాధాన్యం ఉంటుంది. తెలంగాణ కోసం అమరులైన వారే జన సమితికి స్ఫూర్తి. అమరుల స్ఫూర్తి మర్చిపోతే తెలంగాణవాదాన్ని, అస్తిత్వాన్ని, ఆకాంక్షలనే కాకుండా మనలను మనం మరిచినట్టే’’అని పేర్కొన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక చైర్మన్ గురజాల రవీందర్‌రావు మాట్లాడుతూ.. ఇక నుంచి అంతా జన సమితి సభ్యులుగానే ఉంటామన్నారు. కోదండరాం తెలంగాణకు దిక్సూచి అని చెప్పారు. మహిళలకు రాష్ట్ర కేబినెట్‌లో అవకాశం లేదని, దళితులపై మొసలి కన్నీరు కారుస్తున్న సీఎంకు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు.
నేరేళ్ల ఘటనపై సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై మాట్లాడుతున్న సీఎం నేరెళ్లలో దళితులపైకి ఇసుక మాఫియా లారీలను ఎక్కించి చంపితే ఏం చేస్తున్నారని అడ్వొకేట్ రచనారెడ్డి అన్నారు. గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. చలి చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయని, వాటిని అంతం చేయాలని పేర్కొన్నారు. చీమలదండులా జన సమితి బయలుదేరిందని చెప్పారు. పాలపిట్ట, ఆకుపచ్చ రంగు, మధ్యలో నీలిరంగులో తెలంగాణ చిత్రపటం, వాటి మధ్య అమరవీరుల స్థూపంతో పార్టీ జెండాను రూపొందించారు. జెండాను రాజేశ్, లోగోను చింతా స్వామి రూపొందించారు. 29న నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్, కరపత్రాన్ని కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేష్, చింత స్వామిలను సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment