రోదిస్తున్న రైతు కుటుంబ సభ్యులు, కోటేశ్వరరావు అంత్యక్రియల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు
గుంటూరు, యడ్లపాడు: కొన్ని బంధాలు అంత త్వరగా తెగి పోవు.. కొందరు వ్యక్తుల్ని అంత త్వరగా మర్చిపోలేం. గుండెగూటిలో ఆ వ్యక్తి చేసిన త్యాగం చెదరని జ్ఞాపకమై జీవితాంతం మిగిలిపోతుంది. కనుపాపకు రెప్పలా.. తమ బతుకులకు దిక్సూచిలా నిలిచిన ఆ వ్యక్తి కానరాని లోకాలకు వెళ్లిపోతే, కన్నీళ్లు సైతం ఇంకిపోయి నిస్సహాయులుగా మిగిలిన కొన్ని కుటుంబాల వ్యథ ఇది...
కుటుంబాలకు అండగా...
యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన కౌలు రైతు పిట్టల కోటేశ్వరరావు కొండవీడు ఉత్సవాల రెండో రోజున తన పంట పొలంలో పోలీసులు, టీడీపీ నేతల దాడిలో మృతి చెందాడు. కోటేశ్వరరావు మృతి కుటుంబ సభ్యుల్నే కాదు గ్రామస్తులను సైతం కలచి వేసింది. స్వయం కృషితో, ఆత్మస్థైర్యంతో అంచెలంచెలుగా ఎదిగిన కోటేశ్వరరావు ఎనిమిది కుటుంబాలకు పెద్ద దిక్కుగా వ్యవహరించేవాడు. దశాబ్దన్నర కిందటే తల్లిదండ్రులు లింగయ్య, సీతమ్మ కాలం చేశారు. తల్లిదండ్రుల నుంచి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోవడంతో కోటయ్య రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాడు. తన అక్క, నలుగురు చెల్లెళ్లు, కూతురు, కుమారుడి వివాహాలను చేశాడు. తన కుటుంబంతోపాటు అక్క, చెల్లెళ్ల కుటుంబాలకు అండగా ఉన్నాడు. 14 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రకరకాల పంటలను సాగు చేశాడు. రెక్కల కష్టం ఫలించి ఫలసాయం చేతికందే వేళ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.
మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నేతలు రజని, రాజశేఖర్
బాధితులకు నాయకుల పరామర్శ
కోటేశ్వరరావు మృతదేహాన్ని మంగళవారం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కొత్తపాలెంలో గ్రామస్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఆసుపత్రికి చేరుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచారు. మృతుని కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిష్పక్షపాత విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి పరిహారంగా రూ.25 లక్షలు చెల్లించాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ గుంటూరు జిల్లా పశ్చిమ కార్యదర్శి గద్దె చలమయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు పీ నరసింహారావు, సీపీఎం నాయకులు బొల్లు శంకరరావు, పోపూరి సుబ్బారావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి తాటిపర్తి జయరామిరెడ్డి, పొత్తూరి బ్రహ్మానందం, జనసేన, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకుని ప్రభుత్వ, పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుందని ఆరోపించారు. నిజానిజాలు నిగ్గు తేలేవరకు ఎలాంటి పోరాటానికైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. సాయంత్రం కోటేశ్వరరావు మృత దేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి బంధులకు అప్పగించారు. అనంతరం గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
విడదల రజనిఆర్థిక సహాయం అందజేత
మృతుడు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment