తమిళనాడుకు మరో షాక్
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. కేంద్ర మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసు జారీ చేసింది. ఒకే నెలలో 106 మంది రైతులు చనిపోయినట్టు చేసుకున్నట్టు వార్తలు రావడంతో స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ గురువారం తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చింది. అన్నదాతల మరణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టారో తెలపాలని కోరింది.
కాగా, రైతు మరణాల అంశాన్ని ప్రతిపక్ష డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ ఇటీవల ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దృష్టికి తీసుకెళ్లారు. సరిగా పంటలు పండక, రుణభారంతో రైతులు చనిపోతున్నారని వివరించారు. కావేరి నది నుంచి డెల్టా ప్రాంతానికి సరిపడా నీరు రాకపోవడం కూడా రైతు మరణాలకు మరో కారణమన్నారు. అన్నదాతలను ఆదుకోవాలని సీఎంకు వినతిపత్రం ఇచ్చారు. తమిళనాడును కరువు ప్రభావిత రాష్ట్రంగా ప్రకటించాలని రైతు సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.