
ఆ చెత్త అధికారికోసం బిచ్చగాడిలా..
చెన్నై: ఓ అధికారికి లంచం ఇచ్చేందుకు పదిహనేళ్ల బాలుడు బిచ్చగాడిలా మారాడు. వీధుల్లో తిరుగుతూ తాను అలా ఎందుకు మారాల్సి వచ్చిందో వివరిస్తూ పైసాపైసా కూడబెట్టడం మొదలుబెట్టాడు. దీంతో ఆ అధికారి ఉద్యోగం ఊడిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా కున్నతూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అజిత్ అనే పదిహేనేళ్ల బాలుడి తండ్రి విజయ్ గత ఏడాది చనిపోయాడు. కానీ00 అంత్యక్రియలకు కూడా డబ్బు లేక అప్పు చేసిమరీ అజిత్ తండ్రి తుది క్రతువు నిర్వహించాడు.
కాస్తంత ఆసరాగా ఉంటుంది కదా అని తండ్రి మరణానికి పరిహారం కోసం అధికారుల వద్దకు చెప్పులు అరిగేలా తిరిగాడు. ఏడాదిన్నర తర్వాత గానీ ప్రభుత్వం నుంచి సాయం ప్రకటన రాలేదు. అది కూడా అరకొరగా రూ.12,500 మాత్రమే. ఆ డబ్బుకు కూడా కక్కుర్తి పడ్డాడు సుబ్రహ్మణియన్ అనే ఓ అధికారి. తనకు 3000 వేలు లంచంగా ఇస్తేనే తాను రూ.12,500 ఇస్తానని చెప్పాడు. దీంతో ఇక చేసేది లేక ఆ పదిహేనేళ్ల బాలుడు చిరాకుతో ఏకంగా ఓ బ్యానర్ పై తాను ఓ అధికారికి లంచం ఇవ్వాలని, ఆ మొత్తం తన వద్ద లేనందున తనకు దానం చేయాలని వీధివీధిన తిరుగుతూ అడుక్కోవడం ప్రారంభించాడు.
అలా బ్యానర్ పట్టుకొని బస్సుల్లో, స్టేషన్లలో ఆ బాలుడు బిచ్చమెత్తడం మొదలుపెట్టాడు. ఇది కాస్త ఫొటోల రూపంలో, వీడియో రూపంలో ఆన్ లైన్ లోకి వచ్చి హల్ చల్ చేసింది. ఆ బాలుడిని లంచం అడిగిన సుబ్రహ్మణియన్ అధికారిని విధుల నుంచి తప్పించి విచారణకు ఆదేశించారు. కాగా, తాను అసలు లంచం డిమాండ్ చేయలేదని, ఆ బాలుడు మైనర్ అయినందున ఇవ్వలేదని, అతడి తల్లికి ఇస్తానని చెప్పానని బదులిచ్చాడు.