పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మల్లన్న (ఫైల్)
బ్రహ్మ తలరాత రాస్తే... అప్పుల బాధతో ఓ రైతు తన మృత్యురాతను తానే రాసుకున్నాడు. తాను వెళ్లిపోతే.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబీకులు అంత్యక్రియలకు ఎక్కడ ఇబ్బంది పడతారోనని... ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 2018 ఆగస్టు 10న కంబదూరు మండలం రాంపురం గ్రామంలోచోటు చేసుకున్న ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని కంటతడి పెట్టించింది. పంటలు పండక....ప్రభుత్వం ఆదుకోక...అప్పుల బాధతో బలవన్మరణం చెందుతున్న రైతులదీనస్థితిని ప్రపంచానికి చాటింది. కానీ అధికారంలో ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధుల మనసు కరగలేదు. బాధిత కుటుంబానికి కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. ఇప్పుడా కుటుంబం బతికేందుకు నానా తంటాలు పడుతోంది.
అనంతపురం, కంబదూరు : కంబదూరు మండలం రాంపురం గ్రామానికి చెందిన రైతు హరిజన మల్లన్నకు 115–2లో 1.34 ఎకరాలు, 115–1లో 3.17 ఎకరాలు, 114–2లో 2.62 ఎకరాలు మొత్తం 7.13 ఎకరాలు పొలం ఉంది. ఈయనకు భార్య మారెక్క, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు మాధవయ్య గ్రామంలోనే ఉంటూ తండ్రికి వ్యవసాయంలో తోడుగా ఉండేవాడు. చిన్న కుమారుడు అనిల్ తన భార్య పద్మ, మూడేళ్ల కుమార్తెతో పొట్టకూటి కోసం బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నాడు. మల్లన్న పొలంలో దాదాపు ఐదు బోర్లు వేయించాడు. వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండటంతో గత మూడేళ్లుగా పొలంలో వేసిన బోర్లన్నీ ఎండిపోయాయి. తిరిగి ఆశ చావక మళ్లీ పంటలను సాగు చేయాలన్న ఉద్దేశంతో మల్లప్ప అరకొరగా వచ్చే నీటితో 2016లో రూ.50 వేలకు పైగా ఖర్చు చేసి టమాట, వేరుశనగ సాగు చేశాడు. అప్పట్లో రూ.10 వేలు చేతికందింది. తిరిగి 2017లో, 2018లో మరోసారి టమాట, వేరుశనగ సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆశించినస్థాయిలో దిగుబడులు రాకపోవడంతో మల్లప్ప పంటల సాగు కోసం చేసిన అప్పులను ఎలా తీర్చాలోనని అంతర్మథనంలో పడ్డాడు.
2018 ఆగస్టు 9న ఏం జరిగిందంటే...
సాగు చేసిన టమాటకు గిట్టుబాటు ధర రాలేదు. బ్యాంకులో రుణం, బయట ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులతో తీసుకున్న అప్పులు అధికమై ఒత్తిళ్లు పెరిగాయి. పంటకు గిట్టుబాటుధర లేక, ప్రభుత్వం సాయం అందక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితుల్లో మల్లన్న ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో 2018 ఆగస్టు 9న కళ్యాణదుర్గానికి వెళ్లి తన ఫొటోకు జనన, మరణ తేదీలను రాయించుకున్నాడు. అంత్యక్రియలకు అవసరమైన సరుకులు తెచ్చుకున్నాడు. దీంతో పాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుస్తుల వద్ద తీసుకున్న అప్పుల వివరాలను తన తండ్రి లేట్ చిన్న మారెప్ప సమాధి వద్ద ఉంచి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తడిసి మోపెడైన అప్పుల భారం
వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న మల్లన్న కుటుంబాన్ని అప్పుల భారం వెంటాడింది. సదరు పొలంపై నూతిమడుగు ఆంధ్ర ప్రగతి గ్రామీణబ్యాంకు పరిధిలో అకౌంట్ నం.19090000708 రుణం అకౌంట్ నంబర్ 91012068606లలో సుమారు రూ.1.12 లక్షల పంట రుణం తీసుకున్నాడు. కాగా ప్రభుత్వం నుంచి రుణమాఫీకి రూ.52,696 మాత్రమే మాఫీ అవుతుందని, అందులో మూడు విడతలకు గాను మొత్తం రూ.13,174 మాఫీ అయ్యిందని మల్లన్న కుమారుడు మాధవయ్య చెప్పాడు. పంటల సాగు కోసం బ్యాంకులలో తీసుకున్న పంట రుణాల కోసం గ్రామంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుస్తులతో మరో సుమారు రూ.1.73 లక్షలు అప్పులు చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో పాటు గ్రామంలో మారెక్క ఇందిరా డ్వాక్రా సంఘంలో ఉంది. సంఘం సభ్యురాలిగా రూ.13 వేలు అప్పు తీసుకుంది. టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పింది కానీ ఆమె అప్పు అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె షుగర్ వ్యాధి గ్రస్తురాలు. భర్త మల్లన్న చనిపోయిన నాటి నుంచి మానసిక ఆందోళనలో ఉంది.
పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం
అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్న మల్లన్న కుటుంబాన్ని టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం చంద్రబాబు మాటలు నీటి మూటలయ్యాయి. కుటుంబ పెద్ద దిక్కు తనువు చాలించి ఏడు నెలలైనా పట్టించుకున్న పాపాన పోలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
హేళనగా మాట్లాడుతున్నారు
మా తండ్రి మల్లన్న మాకున్న పొలంలో బోర్లు వేసి, పంటల సాగు కోసమే అప్పులు చేశాడు. మా తండ్రి ఆత్మహత్య చేసుకున్న అనంతరం మా ఇంటి వద్దకు రెవెన్యూ అధికారులు వచ్చారు. కొందరైతే 70 ఏళ్లకు పైగా వయస్సు ఉంది. ఎలా వ్యవసాయం చేసి ఉంటాడంటూ...ఎందుకు ఇంత అప్పులు చేశారంటూ హేళనగా మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాలేదు కానీ హేళనగా మాట్లాడటం మాకు మరింత బాధను కలిగిస్తోంది.– మాధవయ్య, మల్లన్న పెద్ద కుమారుడు, రాంపురం
Comments
Please login to add a commentAdd a comment