సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం 8 మంది మృతి చెందడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఉదంతంలో తాజా పరిస్థితులపై నివేదిక అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాకాండకు సంబంధించి ఎవరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టు చేశారు? అనే వివరాలతో నివేదిక వెంటనే ఇవ్వాలని స్పష్టం చేసింది.
యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), జ్యుడీషియల్ కమిషన్ వివరాలను సైతం తమకు తెలియజేయాలని వెల్లడించింది. ఈ సుమోటో కేసుపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఘటనపై విచారణ చేపట్టాలంటూ న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్‌వీ రమణకు లేఖ రాశారు. గురువారం జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. న్యాయవాది త్రిపాఠి వాదనలు వినిపించారు.
మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేఖ ద్వారా ఏం ఉపశమనం కావాలని కోరుకుంటున్నారో చెప్పాలని లాయర్‌ను సీజేఐ ప్రశ్నించారు. ఘటనపై విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని విన్నవించారు. జస్టిస్ హిమాకోహ్లి జోక్యం చేసుకొని ఘటనను సరిగ్గా పరిశీలించలేదని, ఎఫ్‌ఐఆర్ సరిగ్గా నమోదు చేయలేదని పేర్కొన్నారు. అనంతరం యూపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ప్రసాద్ వాదనలు వినిపించారు. ఉదంతంపై ప్రభుత్వం ‘సిట్’ వేసిందని, దర్యాప్తు కోసం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించిందని తెలిపారు.
రైతు తల్లికి తగిన వైద్య సేవలందించండి
‘అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిస్థితిని నివేదికలో తెలియజేయండి. శుక్రవారం విచారణ జరుపుతాం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘‘హత్యకు గురైన వారిలో రైతులతోపాటు ఇతరులు ఉన్నారు. ఎవరెవరిపై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది? ఎవరిని అరెస్టు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకే తాజా పరిస్థితిపై నివేదిక దాఖలు చేయండి’’ అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. అంతకుముందు.. సుమోటో కేసుపై విచారణ ప్రారంభిస్తూ జస్టిస్ ఎన్.వి.రమణ న్యాయవాదులు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. వారు కోరుతున్నట్లుగానే లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా కూడా స్క్రీన్ మీద కనిపించేసరికి ఎవరి తరఫున వాదిస్తున్నారని ప్రశ్నించారు. పౌరుల స్వేచ్ఛ కోసం బార్ సభ్యుడిగా వాదనలు వినిపిస్తానని హన్సారియా బదులిచ్చారు.
ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు
లఖీమ్‌పూర్ ఖేరి: లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను ప్రశి్నంచేందుకు శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసినట్లు ఐజీ లక్ష్మీసింగ్ చెప్పారు. సమన్లకు స్పందించకపోతే చట్టప్రకారం ముందుకెళ్తామని తెలిపారు. ఈ హింసాకాండతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న బన్బీర్‌పూర్‌కు చెందిన లవకుశ్, నిఘాసన్ తహసీల్‌కు చెందిన ఆశిష్ పాండేను అరెస్ట్ చేసి ప్రశి్నస్తున్నట్లు చెప్పారు. హింసాకాండలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదవడం తెల్సిందే.
ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు
లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండపై న్యాయ విచారణకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ సభ్యుడిగా జ్యుడీíÙయల్ కమిషన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు గురువారం ఈ విషయం వెల్లడించారు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. లఖీమ్‌పూర్ ఖేరి కేంద్రంగానే ఈ కమిషన్ పని చేస్తుందని, న్యాయ విచారణను పూర్తి చేయడానికి రెండు నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment