
సాక్షి, శ్రీకాకుళం : పెథాయ్ తుపాను సృష్టించిన అలజడి ఓ రైతు కుటుంబంలో విషాదం నింపింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీట మునగడం తట్టుకోలేక కుప్పకూలిన రైతు.. ఆ పంటపొలంలోనే తనువు చాలించాడు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాలు.... గత మూడు రోజులుగా కోస్తా తీరాన్ని హడలెత్తించిన పెథాయ్ తుపాను కారణంగా జిల్లాలో తీవ్రంగా పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా ధాన్యం నీట మునగడంతో పలువురు రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో గొట్టిపల్లి చిన్నవాడు(70) అనే రైతు ధాన్యం తడిసిపోతుందన్న ఆవేదనతో మంగళవారం పొలంలో ఉన్న నీటిని దిగువకు వదిలేందుకు సమాయత్తమయ్యాడు. పార పట్టుకుని పొలంలో బట్టీ వేస్తుండగానే గుండె పోటు రావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. కాగా మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment