సాక్షి, పాతపట్నం: స్థానిక కోటగుడ్డి కాలనీకి చెందిన కౌలు రైతు గుర్రం రాంబాబు (39) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..రాంబాబు రెండు ఏకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. కలాసీగా పని దోరకపోవడంతో వ్యవసాయం చేస్తున్నాడు. పెట్టుబడి కోసం అప్పులు చేశాడు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో మనస్థాపం చెంది ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకోవడంతో రాంబాబు మరదలు కుమారి చూసింది. కూలి పనికి వెళ్లినరాంబాబు భార్య జయలక్ష్మికి సమాచారం చేరవేసింది. రాంబాబును ఆటోలో పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వైద్యుడు కిషోర్ ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆదివారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తిరిగి పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుచ్చి శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని రాంబాబు మృతి గల కారణాలను భార్య జయలక్ష్మి, కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. మృతుడుకి కుమారుడు చందు, కుమార్తె నీలిమ ఉన్నారు. మృతుడి భార్య జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ఎస్‌ఐ పి.సిద్ధార్థకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment