![Woman Ends Her Life In Hostel Room Srikakulam District - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/1/pavani.jpg.webp?itok=LNWXtLAz)
పావని ( ఫైల్ ఫొటో)
శ్రీకాకుళం: ఏం కష్టం వచ్చిందోగాని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నగరంలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో చోటుచేసుకుంది. రిమ్స్‌లో జనరల్ డ్యూటీ అసిస్టెంట్‌గా శిక్షణ పొందుతున్న మజ్జి పావని (21) సోమవారం తాను ఉంటున్న అతిథి గృహంలోని శ్లాబ్ హుక్‌కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుందని పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. రేగిడి ఆమదాలవలస మండలం చిన్న శిర్లాం గ్రామానికి చెందిన పావని కొంతమంది విద్యార్థినులతో కలిసి ప్రైవేటు అతిథి గృహంలో ఉంటుంది.
సోమవారం విద్యార్థినులంతా రిమ్స్ కళాశాలకు వెళ్లారు. అయితే పావని రాకపోవడంతో రూమ్ వద్దకు వెళ్లి చూడగా శ్లాబ్ హుక్‌కు వేలాడుతూ కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని పావని తండ్రి అప్పలనాయుడుకు తెలియజేశారు.
తండ్రి, హాస్టల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఈశ్వర్‌ప్రసాద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని ప్రాధమికంగా దొరికిన ఆధారాల మేరకు అభిప్రాయపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నశిర్లాంలో విషాదం
రేగిడి: పావని మృతితో ఆమె స్వగ్రామం చిన్నశిర్లాంలో విషాదం అలముకున్నాయి. తమ కుమార్తె ఏఎన్‌ఎం శిక్షణ కోసం మూడు నెలల క్రితం శ్రీకాకుళం వెళ్లిందని.. ఇంతలోనే ఏం జరిగిందో గాని చనిపోయిందని తల్లిదండ్రులు మంగమ్మ, అప్పలనాయుడు విలపిస్తూ చెప్పారు.
పావని కుటుంబ సభ్యులను వైస్ ఎంపీపీ టంకాల అచ్చెన్నాయుడు, సర్పంచ్ టంకాల ఉమా, నాయకుడు పాపినాయుడు పరామర్శించారు. పావని తండ్రి అప్పలనాయుడు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కుమార్తెకు వివాహం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment