అప్పులబాధతో ఆగిన రైతు గుండె
– మూడేళ్లుగా చేతికందని పంటలు
– రూ.మూడు లక్షలకు చేరిన అప్పులు
– అరకొరగా పంటనష్ట పరిహారం
అప్పుల వ్యధతో ఓ రైతు గుండె ఆగింది. వర్షాభావంతో మూడేళ్లుగా పంటలు చేతికందకపోగా.. పంటల సాగు కోసం చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. బోరుబావిలో భూగర్భజలాలు అడుగంటడంతో అర ఎకరం తరి భూమి కూడా బీడుగా మారింది. వీటికి తోడు ప్రభుత్వం మంజూరు చేసిన పంటనష్ట పరిహారం అరకొర మొత్తం జమకావడంతో అప్పులు ఎలా చెల్లించాలన్న మనోవేదన ఆ రైతును కుంగదీసింది. ఫలితంగా గుండె ఆగింది.
- నల్లమాడ
నల్లమాడ మండలంలోని నల్లసింగయ్యగారిపల్లికి చెందిన బోడెద్దుల కుళ్లాయప్ప (65) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. బోరుబావి కింద ఉన్న అర ఎకరం పొలంలో సత్తువ కోసం గొర్రెలు తోలించేందుకు శనివారం ఉదయం కాపరుల చేత తడికెలు నాటిస్తున్నాడు. ఉన్నఫళంగా గుండెపోటు రావడంతో అక్కడే అతడు కుప్పకూలాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. అతడికి భార్య అక్కులమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అప్పులబాధ తాళలేక గుండెపోటుతో మృతి చెందినట్లు అతడి భార్య బోరున విలపించింది.
వరుస కురువుతో..
అతడికి 3.53 ఎకరాల భూమి ఉంది. మూడేళ్ల నుంచి వేరుశనగ సాగు చేస్తున్నాడు. వానలు లేక, పంటలు పండక పైసా కూడా చేతికందలేదు. గత ఏడాది కూడా పంట ఎండిపోవడంతో గొర్రెలకు వదిలేశాడు. బోరుబావి కింద అర ఎకరంలో పొద్దుతిరుగుడు పంట వేస్తే నీళ్లు లేక ఎండిపోయింది. పంట పెట్టేందుకు, బోరు కోసం చేసిన అప్పులు రూ.3 లక్షలకు పైనే ఉన్నాయి. పంట నష్ట పరిహారం కూడా తక్కువగా పడింది. అప్పులు ఎలా చెల్లించాంటూ రోజూ మధనపడుతుండేవాడని భార్య వాపోయింది. పంట నష్ట పరిహారం వస్తే అప్పులోళ్లకు వడ్డీలైనా కట్టాలనుకున్నాం. అదికూడా అరకొరగా జమకావడంతో ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు ఆమె కన్నీరుమున్నీరైంది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.