మృతదేహం దగ్గర రోదిస్తున్న కుటుంబ సభ్యులు, (ఇన్‌సెట్లో) మహదేవప్ప మృతదేహం
గట్టు (గద్వాల): నాన్నా.. ఒకసారి చూడవా.. మాతో మాట్లాడు నాన్న అంటూ ఆ చిన్నారులు తండ్రి మృతదేహం దగ్గర రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆలనా.. పాలనా చూసే కన్నతండ్రి శాశ్వతంగా తమ నుంచి దూరమయ్యాడని తెలిసిన పెద్దమ్మాయి రోదనలు అందరినీ కలచివేశాయి.. అసలేం జరిగింది.. నాన్న అలా ఎందుకు పడుకున్నాడు.
నాన్న చుట్టూ జనం చేరి ఎందుకు రోదిస్తున్నారో తెలియక మిగతా చిన్నారులు బిక్కమొహం వేసుకుని అదే పనిగా దిగాలు కూర్చున్న వారిని చూసిన గ్రామస్తులు అయ్యో పాపం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన మండలంలోని రాయాపురంలో గురువారం చోటుచేసుకుంది.
పత్తికి నీరు పారించేందుకు..
మండలంలోని గ్రామానికి చెందిన బందెయ్యల మహదేవప్ప(33) గురువారం ఉదయం ఎద్దుల బండిని కట్టుకుని గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలానికి వెళ్లాడు. చుట్టుపక్కల ఉన్న 21 మంది రైతులంతా కలిసి పల్లెయ్యల రాయన్న పొలంలో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మోటార్లపై లోడ్ పడుతున్న కారణంగా రైతులు రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరోజు 10 మంది రైతులు, మరో రోజు మిగతా రైతులు వారి బోర్లకు విద్యుత్ సరఫరా చేసుకుంటూ పంటలను పండించుకుంటున్నారు.
మహదేవప్పకు రెండెకరాల పొలం ఉంది. ఇందులో ఎకరా విస్తీర్ణంలో సీడ్ పత్తి సాగుచేయగా.. మిగతా పొలంలో వరి నాటు వేసుకునేందుకు గాను వరి నారు పోశాడు. ఈ క్రమంలో పత్తి పొలానికి నీరు పారించుకునేందుకు ఉదయమే పొలానికి వెళ్లాడు. విద్యుత్ లైన్ మర్చాల్సి ఉండగా.. సమీపంలో రైతులు ఎవరూ లేకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర ఏబీ స్విచ్‌ను ఆఫ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న ఎర్త్ వైరుపై పడ్డాడు.
అటుగా వెళ్తున్న రైతులు గమనించి బందెయ్యల మహదేవమ్మను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే విద్యుదాఘాతంతో మృతిచెందాడు. సమాచారం అందుకున్న మహదేవయ్య భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని బోరున విలపించారు. భార్య, కూతుళ్లు రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. మహదేవయ్యకు భార్య నర్సమ్మతోపాటు ముగ్గురు కుమార్తెలు అనిత, సంజన, దేవసేన, కుమారుడు శివాజీ ఉన్నారు.
కేసు నమోదు..
గట్టు నుంచి రాయాపురం వరకు ఉన్న పాతకాలం నాటి విద్యుత్ హైటెన్షన్ వైర్లు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని రాయాపురం గ్రామస్తులు ఆరోపించారు. వీటిని మార్చమని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు అనేక పర్యాయాలు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక లోడు పడి అమాయక రైతులు బలై పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, సహకార సంఘం అధ్యక్షుడు రాముడు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. మహదేవయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment