క్షామ నామ సంవత్సరం | Farmers had bad experience in 2018 | Sakshi
Sakshi News home page

క్షామ నామ సంవత్సరం

Published Sat, Dec 29 2018 4:56 AM | Last Updated on Sat, Dec 29 2018 4:56 AM

Farmers had bad experience in 2018 - Sakshi

వాని ఱెక్కల కష్టంబు లేనినాడు,సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు, వాడికి భుక్తిలేదు!
– గుర్రం జాషువా 

సాక్షి, అమరావతి: 2018... రాష్ట్రంలో అన్నదాతల పాలిట క్షామ నామ సంవత్సరం. వ్యవసాయ రంగంలో ఈ ఏడాదంతా తిరోగమనమే  తప్ప పురోగమనం జాడ లేదు. అన్నదాతకు అశ్రువులే మిగిలాయి. ప్రభుత్వ తప్పుడు విధానాలు, అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి విపత్తులు, పెరిగిపోయిన పెట్టుబడులు, దక్కని గిట్టుబాటు ధరలు, పెట్రేగిపోతున్న దళారీ వ్యవస్థ, వారికే వత్తాసు పలికే అధికార వర్గం... వెరసి రైతన్నలు దారుణంగా మోసపోయారు. 

అన్నదాతల ఆత్మహత్యలతోనే 2018 మొదలైంది. రెయిన్‌ గన్‌లతో పంటలను కాపాడే, కరువులను జయించే, సముద్రాలను నియంత్రించగలిగే చంద్రబాబు పాలనలో రైతుల బలవన్మరణాల పరంపరకు అడ్డుకట్ట పడడం లేదు. మట్టి నుంచి మాణిక్యాలను పండించే రైతు నోట్లో ఈ ఏడాదీ మట్టే పడింది. 2018లో పండించిన ఆహార, ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధరలు దక్కలేదు. ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, పత్తి, చెరకు, పొగాకు.. దేనికీ ధర లేకుండా పోయింది. ఉద్యాన పంటలైన టమోటా మొదలు మామిడికి కూడా గిట్టుబాటు ధరలు రాలేదు. రాష్ట్రంలో అత్యధికంగా పండించే వరికి క్వింటాల్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1,750 కాగా, రైతుకు దక్కింది రూ.1100 నుంచి రూ.1350 మాత్రమే కావడం గమనార్హం. ఇక మిగిలిన పంటల పరిస్థితి చెప్పనక్కర్లేదు. లక్షలాది క్వింటాళ్ల శనగలు కొనేవారు లేక గిడ్డంగుల్లో పేరుకుపోయాయి. తెల్లజొన్నలు కొనే దిక్కులేకుండా పోయింది. రాయలసీమలో వేరుశనగ సాగుచేసిన రైతులు కరువు వల్ల పంటను కోల్పోయి రూ.4,650 కోట్లు నష్టపోయారు. 

కరవును జయించిందెక్కడ?
జూన్‌ నుంచి మొదలై సెప్టెంబర్‌తో ముగిసిన ఖరీఫ్‌ సీజన్‌లో 18 శాతం, రబీలో ఇప్పటిదాకా 58 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 4 లక్షల హెక్టార్లు తగ్గింది. రబీలో సాగు విస్తీర్ణం 10 లక్షల హెక్టార్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా, ఇందులో 480 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. ప్రభుత్వం కేవలం 347 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. వరుణుడి కరుణ లేక, పంటలు పండక,  సొంత ఊళ్లలో బతికే దారి కనిపించక రైతులు, వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు తరలి పోతున్నారు. పశువులను పోషించలేక కబేళాలకు తరలిస్తున్నారు. అయినా కరువును జయించామని, 2018 ఖరీఫ్‌లో రెయిన్‌గన్‌లతో 25,795 హెక్టార్లలో పంటలను కాపాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండడం గమనార్హం. 

నకిలీ విత్తనాలు.. చుట్టుముట్టిన తెగుళ్లు 
వ్యవసాయ శాఖ వైఫల్యాలు రైతుల పాలిట శాపంగా మారాయి. నకిలీ విత్తనాలు, పురుగు మందులు, చుట్టుముట్టిన తెగుళ్లు, అధికారుల నిర్లక్ష్యం, ధాన్యం సేకరణలో వైఫల్యంతో రైతులు ఈసారి తీవ్రంగా నష్టపోయారు. మెగాసీడ్‌ పార్క్‌ అంటూ ప్రభుత్వం హడావిడి చేసినా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. 

ధరల స్థిరీకరణ నిధి ఉంటే.. 
గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టుగా రూ.5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఉంటే రైతులకు ఈ ఏడాది కొంతలో కొంతైనా ఊరట లభించేది. మొక్కజొన్న, జొన్న రైతులకు, చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడికి, ఆగస్టులో వచ్చిన అకాల వర్షాలకు నష్టపోయిన వరికి ప్రభుత్వం ఇస్తామన్న సాయం ఇంతవరకూ అందలేదు. రైతులు ఈ ఏడాది పంటల సాగు కోసం రూ.19,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. కరువు, తుపాన్ల వల్ల ఈ పెట్టుబడులు కూడా చేతికి రాలేదు.  

ఆగని ఆత్మహత్యలు 
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో సగటున ఏడాదికి 79 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటికి 163 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. రుణమాఫీ జరగక, బ్యాంకుల నుంచి రుణాలు అందక, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకోవడంతోపాటు పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఊసే లేకుండా పోయింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు, కౌలు రైతులే. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలెం గ్రామానికి చెందిన కొండవీటి బ్రహ్మయ్య అనే రైతు  తాను ఎలా నష్టపోయిందీ సవివరంగా ముఖ్యమంత్రికి లేఖ రాసి, కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి పురుగుమందు తాగి తనువు చాలించడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు, పాల డెయిరీలు వరుసగా మూతపడుతున్నాయి. బకాయిల కోసం రైతులు పోరుబాట పట్టినా ప్రభుత్వం చలించడం లేదు. యూనివర్సిటీలలోని పరిశోధనా ఫలితాలు క్షేత్రస్థాయికి చేరడం లేదు. తెగుళ్లు చుట్టుముట్టినా శాస్త్రవేత్తల బృందాలు పొలాలకు వెళ్లడం లేదు. మొక్కజొన్నకు కత్తెర తెగులు ఆశించడంతో రైతులు రాత్రికి రాత్రి పంటను ధ్వంసం చేశారు. 

శోకం మిగిల్చిన తుపాన్లు 
రాష్ట్ర రైతాంగం ఈ ఏడాది మూడు తుపాన్లు– తిత్లీ, గజ, పెథాయ్‌.. రెండుసార్లు అకాల వర్షాలను చవిచూసింది. ఉత్తరాంధ్రను తిత్లీ, పెథాయ్‌ వణికిస్తే.. కోస్తాను గజ, పెథాయ్‌ తుపాన్లు గడగడలాడించాయి. మే, ఆగస్టులలో కురిసిన అకాల వర్షాలు ఉద్యాన పంటల్ని దెబ్బతీశాయి. ఖరీఫ్‌కు ముందు కురిసిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటల్ని రైతులు పొలాల్లోనే వదిలేశారు. అపరాలు చేతికి అందకుండానే పోయాయి. గోదావరి, కృష్ణా డెల్టాలో వరిని తుపాన్లు నష్టపరిచాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పంటల్ని తిత్లీ తుపాను తీవ్రంగా ముంచేసింది. జీడి పంట, జీడి పరిశ్రమ కోలుకోలేని విధంగా నష్టపోయాయి. 

ఆదుకోని రుణమాఫీ 
తాము అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. బాబు అధికారంలోకి వచ్చే నాటికి రైతుల రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా, చంద్రబాబు రుణమాఫీ కోసం కేవలం రూ.24,500 కోట్లు ఇస్తామంటున్నారు. అంటే ఆ సొమ్ము రుణాలపై వడ్డీలకు కూడా సరిపోదు. ఈ ఏడాది ఇవ్వాల్సిన మూడో విడత డబ్బులు ఇంకా రైతులకు అందలేదు. సర్కారు విధానాల వల్ల బ్యాంకుల నుంచి రైతులకు అప్పులు పుట్టడం లేదు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ రైతులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. 

సంఘటితమవుతున్న రైతులు 
వాతావరణ మార్పులతో రైతులు ఈ ఏడాది 27 శాతం ఆదాయం కోల్పోనున్నట్టు ఆర్థిక సర్వే చెబుతోంది. ఉత్పత్తి వ్యయంపై 50 శాతాన్ని కలిపి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర ఇవ్వలేదు. శాశ్వత రుణ విముక్తి లేదు. పెట్టుబడి సాయం లేదు. బీమా సొమ్ము చేతికి రాలేదు. ప్రకృతి కనికరించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పెల్లుబికినట్టే రాష్ట్రంలోనూ రైతులు సంఘటితం అయ్యే ప్రయత్నం ఈ ఏడాది జరిగింది. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం కోసం  ధర్నాలు చేశారు. తుందుర్రు ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రభుత్వ భూ సమీకరణ విధానాన్ని వ్యతిరేకించారు. గిట్టుబాటు ధరలు ఇచ్చే వరకు విశ్రమించబోమని తేల్చిచెప్పారు. 

అంతా బాగుందట!
సంక్షోభంలో చిక్కుకుని రైతన్నలు అష్టకష్టాలు పడుతుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తూ వ్యవసాయ రంగంలో ప్రగతి అద్భుతంగా ఉందని సెలవిచ్చారు. అధిక ఆదాయం కోసమే వలసలు వెళుతున్నారని అనడం కొసమెరుపు. మరి అంతా బాగుంటే ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేసిన రోజే కర్నూలు జిల్లాలో ఓ యువరైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement