
వరంగల్ క్రైం: పంట నష్టం, అప్పుల బాధ తదితర కారణాలతో గ్రామాల్లో జరిగే రైతుల ఆత్మహత్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నకిలీ విత్తన ముఠాల వివరాలు వెల్లడించిన సీపీ.. అనంతరం పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ క్రమంలో రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతూ ‘గ్రామాల్లో జరుగుతున్నవన్నీ రైతు ఆత్మహత్యలు కాదు.. గుండెపోటు, అనారోగ్యంతో చనిపోయినా రైతు ఆత్మహత్యలుగా నమోదయ్యేవి. గతంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం రూ.లక్ష పరిహారం ఇచ్చేది. అందుకే రైతు ఆత్మహత్యగా నమోదు చేసేవాళ్లం. ఎలా చనిపోయినా రైతు ఆత్మహత్యగానే నమోదు చేయడంతో సంఖ్య ఎక్కువగా ఉంది..’అని అన్నారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో రావడంతో సీపీ వివరణ ఇచ్చారు.
6 నెలలుగా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు: రైతు ఆత్మహత్యలపై ఎలాంటి వివాదం లేదని సీపీ వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించడం ద్వారా ఆరు నెలల కాలంగా ఏ ఒక్క రైతు కూడా ఆర్థిక, పంటనష్టం కారణంతో ఆత్మహత్యకు పాల్పడలేదని, ఈ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎక్కడా ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యన్నతి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే రైతుబీమా పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారన్నారు.
కానీ రైతులు, పోలీసులకు ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఇతర కారణాలతో రైతులు మరణిస్తే 2004లో అప్పటి ప్రభుత్వం జారీచేసిన 421 జీఓ నిబంధనల ప్రకారమే ఆర్థిక సాయం కోసం రైతు ఆత్మహత్యలుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం రైతులు ఏ విధంగా మరణించినా బాధిత కుటుంబాలకు రైతుబీమా ద్వారా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారని తెలిపారు.