సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఈ ఏడాది అనంతపురం జిల్లా వ్యవసాయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. కొన్నేళ్లుగా కరువుతో అల్లాడిన జిల్లా రైతుల ముఖాల్లో ఇప్పుడు ‘వర్షా’తిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వలస బాట పట్టిన రైతులు, రైతు కూలీలు సొంతూళ్లకు తరలివస్తూ పొలం బాట పడుతున్నారు. జిల్లా నుంచి ఏటా సుమారు 4 లక్షల మంది పనుల కోసం వలస వెళ్తుంటారు. వర్షపు చినుకు మీద ఆశతో పంట వేసిన రైతు.. అది పండకపోతే ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో గత ఐదేళ్లలో ఏకంగా 300 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జిల్లాలో అద్భుతం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో కుంటలు, చెరువులు నిండిపోయాయి.
గత ఆగస్టులో భూగర్భ నీటి మట్టం 27.75 మీటర్ల లోతున ఉండగా... ప్రసుత్తం 19.72 మీటర్లకు చేరింది. బోర్లు రీచార్జ్ అయ్యాయి. జిల్లాలో 70 వేల బోర్లు రీచార్జ్ కాగా, భూగర్భంలో 56 టీఎంసీల నీరు ఇంకిందని లెక్కలు చెబుతున్నాయి. హంద్రీ–నీవా ద్వారా చెరువులకు నీరు విడుదల చేయడంతో అదనంగా 50 వేల ఎకరాలు, హెచ్చెల్సీ కింద అదనంగా 20 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. దీంతో ఇప్పటికే సగం మంది వలస రైతులు సొంత గ్రామాలకు తిరిగొచ్చి పంటలు సాగు చేసుకుంటున్నారు. వీటన్నింటికీ తోడు వైఎస్సార్ రైతు భరోసా కింద జిల్లాలో 7,12,625 మంది అన్నదాతలకు లబ్ధి కలిగింది. అమ్మఒడి, నేతన్న నేస్తం, తదితర ప్రభుత్వ పథకాలు ఆయా వర్గాల వారికి భరోసా కల్పించడంతో ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారు.
పెరిగిన సాగు.. చేతినిండా పని
జిల్లాలో మొత్తం 63 మండలాలకు గాను ఈ ఏడాది 21 మండలాల్లో 20 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 32 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. 10 మండలాల్లో మాత్రమే తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 483.8 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది నవంబర్ 8 నాటికే 492.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్, జూలైలో వర్షాలు లేక వేరుశనగ సాగు కొంత తగ్గింది. పత్తి, ఉలవలు, జొన్న, ఆముదం సాగు బాగా పెరిగింది. రబీలో కూడా సాగు విస్తీర్ణం పెరగనుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రబీలో 1,14,193 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా>, లక్షా 20 వేల హెక్టార్ల వరకూ సాగు కావచ్చని భావిస్తున్నారు. దీంతో వ్యవసాయ పరంగా కూలీలకు పనులు బాగా దొరుకుతున్నాయి.
ఈ రైతు పేరు కృష్ణమూర్తి. అనంతపురం జిల్లా రొళ్ల మండలం హెచ్‌టీ హళ్లి గ్రామం. తనకున్న 2.75 ఎకరాల కోసం బోరు బావి తవ్వించాడు. వర్షాభావంతో ఎండిపోయింది. బోరుపై రూ.2 లక్షల వరకు పెట్టి నష్టపోయాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు భార్యా పిల్లలతో 2017లో బెంగళూరుకు వలసపోయాడు. అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. ఈ ఏడాది భారీ వర్షాలతో జిల్లాలో భూగర్భ జలమట్టం పెరగడంతో కృష్ణమూర్తి బోరు నుంచి నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. దీంతో గత నెలలో స్వగ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు ప్రారంభించాడు.
రైతు వెంకటేశులది గుమ్మఘట్ట మండలంలోని రంగచేడు. రెండు నెలల క్రితం వరకూ బెంగళూరు, మైసూర్, చిక్‌మగులూరు ప్రాంతాల్లో కూలి పనులు చేసేవాడు. ఇప్పుడు గ్రామంలో సమృద్ధిగా వర్షాలు పడడంతో తనకున్న 5 ఎకరాల పొలంలో వరి, పత్తి సాగు చేశాడు. మొన్నటి వరకు కూలీగా పనిచేసిన తను.. ఇప్పుడు ఇంకొకరికి కూలి పని ఇస్తున్నానని ఆనందంగా చెబుతున్నాడు.
ప్రభుత్వ భరోసా పెరిగింది..
ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. దీంతో బెంగళూరు నుంచి మా ఊరికి వచ్చేశాము. 2 ఎకరాల్లో పంటలను సాగు చేశా. 4 పాడి గేదెలను పెట్టుకున్నా. ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా పెరిగింది.
– శివన్న, కాకి గ్రామం, రొళ్ల మండలం
వలస వెళ్లిన వారు తిరిగొస్తున్నారు
జిల్లాలో వర్షాలు బాగా కురవడంతో పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగొస్తున్నారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 6 వేల క్యూసెక్కులకు పెంచడం, సమాంతర కాలువను 4 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించేందుకు సీఎం అంగీకరించారు. ఇది జరిగితే జిల్లాలో వలస అనే మాటే వినపడదు.
– సత్యనారాయణ, జిల్లా కలెక్టర్
రైతులు సంతోషంగా ఉన్నారు
గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడటంతో బోర్లు రీచార్జ్ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా మొత్తం రైతులకు మరింత ధైర్యాన్నిచ్చింది. సాగు విస్తీర్ణం పెరిగింది. చిరుధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం.
– హబీబ్ బాషా, వ్యవసాయశాఖ జేడీ
Comments
Please login to add a commentAdd a comment