మచిలీపట్నం: ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందే రైతు భరోసా నగదు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన రైతులందరికీ డాక్టర్ వైఎస్సార్ భరోసా పథకం మంజూరు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2021–22లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3,26,326 మంది రైతులు ఈ పథకం కింద ప్రయో జనం పొందారు.
2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మే నెలలో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అర్హుల జాబితాల తయారీపై అధికారులు దృష్టి సారించారు. పథకం రాని వారు ఇంకా ఎవరైనా ఉంటే, వారి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన వారు, లబ్ధిదారులు చనిపోతే, వారి కుటుంబంలో మరొకరు సాయం అందుకునేలా పేరు మార్పు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు.
అర్హులందరికీ అందించేలా..
కౌలు రైతులకు కూడా భరోసా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి వారికి పథకం మంజూరు కోసం కౌలు గుర్తింపు కార్డులు అందజేసేందుకు ఈ నెల 30 వరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ సహాయకులు, సచివాలయ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు గ్రామాల్లోని రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు సిద్ధం చేసిన అర్హుల జాబితాలాను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. రైతులంతా జాబితాను పరిశీలించుకునేలా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
సాగుకు భరోసా..
డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 ప్రభుత్వం సాయంగా అందిస్తోంది. దీనిలో భాగంగా 2022–23 సంవత్సరానికి ఎంపిక చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లోనే తొలి విడత సాయం రూ.7,500 నేరుగా జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు ముందుగానే భరోసా డబ్బులు అందించేలా జరుగుతున్న ఏర్పాట్లతో రైతుల్లో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.
సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ..
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టమొచ్చినా, ప్రభుత్వం ఆదుకుంటుందనే ధీమాతో రైతులు సాగుకు సై అంటున్నారు. గతంలో సంభవించిన తుపానులతో పంట నష్టపోయిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 1,52,368 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.105.30 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. సున్నా వడ్డీ సైతం సకాలంలో జమ చేస్తుండటంతో రైతులకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.
పేర్లు లేని వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం
లబ్ధిదారుల జాబితాలను జిల్లాలోని అన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాం. వాటిని రైతులు పరిశీలించుకోవాలి. జాబితాలో పేర్లు లేని వారు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. అర్హులైన రైతులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకం అందించేలా శ్రద్ధ తీసుకుంటున్నాం.
– మనోహర్‌రావు, కృష్ణా జిల్లా వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment