వాస్తవ దూరమైన కథనం.. అది ‘ఈనాడు’ ఆత్మఘోష | Eenadu Fake News On AP Govt Farmer Welfare Programs | Sakshi
Sakshi News home page

వాస్తవ దూరమైన కథనం.. అది ‘ఈనాడు’ ఆత్మఘోష

Published Tue, Aug 30 2022 3:54 AM | Last Updated on Tue, Aug 30 2022 2:47 PM

Eenadu Fake News On AP Govt Farmer Welfare Programs - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్న సంకల్పంతో పగ్గాలు చేపట్టింది మొదలు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతీ అడుగు రైతు సంక్షేమం దిశగానే వేస్తున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా సీజన్‌కు ముందుగానే సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను పంపిణీ చేస్తున్నారు. ఇచ్చిన మాట కంటే మిన్నగా వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని  అందించడమే కాకుండా సకాలంలో పంట రుణాలు అందిస్తున్నారు.

వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు సీజన్‌ ముగియకుండానే పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారం చెల్లిస్తున్నారు. పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మూడేళ్లలో వివిధ పథకాల ద్వారా రైతులకు నేరుగా రూ.1.28 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.19,709.20 కోట్లకు పైగా బకాయిలను చెల్లించింది. ఇంతలా అన్నదాతలకు అండగా నిలుస్తుంటే కడుపు మంట తట్టుకోలేక ఈనాడు నిత్యం రోత రాతలు రాస్తూ ప్రభుత్వంపై అదే పనిగా బురద చల్లుతోంది.

మూడేళ్లలో రూ.23,875.29 కోట్ల పెట్టుబడి సాయం
వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. మూడేళ్లలో ఇప్పటి వరకు రూ.23,875.29 కోట్లు అందించారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద మూడేళ్లలో 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్లు బీమా పరిహారం ఇచ్చారు. రూ.లక్ష లోపు పంట రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు సీజన్‌న్‌ ముగియకుండానే వడ్డీ రాయితీని అందిస్తున్నారు. ఇలా గత బకాయిలతో కలిపి మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ.1,282.11కోట్లు చెల్లించారు. మూడేళ్లలో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 19.94 లక్షల ఎకరాలకు సంబంధించి 17.61 లక్షల మందికి రూ.1,612.80 కోట్ల పంట నష్టపరిహారాన్ని సీజన్‌ ముగియకుండానే అందించారు.

ఆర్బీకేల ద్వారా 1.12 కోట్ల మందికి సేవలు
విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్నకు అండగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన 10,778 ఆర్బీకేల ద్వారా గత 27 నెలల్లో 1.12 కోట్ల మందికి సేవలందించారు. ఆర్బీకేల ద్వారా 34.65 లక్షల మంది రైతులకు రూ.564.50 కోట్ల విలువైన 19.22 లక్షల టన్నుల విత్తనాలు, 13.62 లక్షల మంది రైతులకు రూ.529.24 కోట్ల విలువైన 5.16 లక్షల టన్నుల ఎరువులు, 1.51 లక్షల మందికి రూ.14కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులను పంపిణీ చేశారు.

ఆర్బీకేలకు అనుబంధంగా రూ.16 వేల కోట్లతో గోదాములతో పాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సర్టిఫై చేసిన ఇన్‌పుట్స్‌ సరఫరా కోసం జిల్లా, రాష్ట్ర, నియోజక వర్గ స్థాయిలో రూ.213 కోట్ల అంచనాతో వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు తీసుకొచ్చారు. ఆర్బీకే స్థాయిలో రూ.587.64 కోట్లతో 6781, రూ.161.50 కోట్లతో 391 క్లస్టర్‌స్థాయిలో వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

వైఎస్సార్‌ జలకళ కింద రూ.5,715 కోట్లు వెచ్చిస్తూ రైతులపై పైసా భారం పడకుండా ఉచితంగా 2 లక్షల బోరు బావులు తవ్వుతున్నారు. ఉచిత విద్యుత్‌ కోసం మూడేళ్లలో రూ.25,561 కోట్లు ఖర్చు చేశారు. పంటవేసే సమయంలోనే కనీస మద్దతు ధర ప్రకటించడమే కాకుండా మూడేళ్లలో రూ.44,844.31 కోట్ల విలువైన ధాన్యంతో పాటు రూ.6,903 కోట్ల విలువైన ఇతర పంటలను కొనుగోలు చేశారు. ఇవేమీ ఈనాడుకు కనిపించలేదు. సింగిల్‌కాలం వార్త కూడా రాసిన పాపాన పోలేదు.

అందులో వాస్తవాలు లేవు..
అన్నదాతలు ఆత్మఘోష కధనం వాస్తవ విరుద్ధంగా ఉంది. 2020తో పోలిస్తే 2021లో 19.79 శాతం మేర రైతుల ఆత్మహత్యలు పెరిగినట్లు పేర్కొనటంలో వాస్తవం లేదు. 2020తో పోలిస్తే 2021లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. 2022లో ఇప్పటి వరకు 74 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ కార్మికులు పలు కారణాలతో చనిపోతుంటారు. అది రైతుల ఆత్మహత్యల కిందకు రావు. ఏ కారణంతో చనిపోయినా వారికి వైఎస్సార్‌ బీమా కింద రూ.లక్ష పరిహారం అందచేస్తున్నాం.    
– చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ

తప్పుల తడకలే..
అడుగడుగునా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంటే జీర్ణించుకోలేని చంద్రబాబు భజన పత్రిక ఈనాడు ‘అన్నదాతల ఆత్మఘోష’ అంటూ సోమవారం వాస్తవ దూరమైన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ఏపీలో 2020లో 889 మంది, 2021లో 1,065 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, 2020తో పోలిస్తే 2021లో 19.79 శాతం మేర ఆత్మహత్యలు పెరిగిపోయినట్లు అచ్చు వేసింది.

వాస్తవానికి 2020లో 287 మంది, 2021లో 223 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు త్రిసభ్య కమిటీలు నిర్ధారించాయి. బాధిత కుటుంబాలకు రూ.7లక్షలు చొప్పున పరిహారం కూడా అందించారు. టీడీపీ హయాంలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్ప డితే అసలు వారు రైతులే కాదని, అవి ఆత్మహత్యలే కాదన్నట్లుగా రికార్డుల్లో కూడా నమోదు చేసేవారు కాదు.

ఈ కారణంగా టీడీపీ హయాం లో ఐదేళ్లలో 1,004 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించగా, వారిలో పరిహారం ఇచ్చింది 531 మందికే. చంద్రబాబు ఎగ్గొట్టిన మిగతా 473 మంది బాధిత రైతు కుటుంబాలకు 2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున రూ.23.65కోట్ల పరిహారాన్ని అందించింది. రైతన్నలు ఏ కారణాలతో చనిపోయినా వారి కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

ఎలాంటి సిఫార్సులు లేకుండా త్రీమెన్‌ కమిటీ నిర్ధారణే కొలమానంగా ఆత్మహత్యకు పాల్పడే రైతు కుటుంబాలను ఆదుకుంటున్నారు. మూడేళ్లలో 900 మంది మృత్యువాతపడగా, రూ.7 లక్షలు చొప్పున రూ.63 కోట్ల పరిహారాన్ని అందించారు. వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు సాగు సంబంధిత కారణాల వల్ల జరిగిన ఆత్మహత్యలు కావు కాబట్టి రైతుల ఆత్మహత్యల పరిధిలోకి రావన్న విషయాన్ని ఈనాడు విస్మరించడం విడ్డూరంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement