సిద్దిపేట క్రైం: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ శివారులోని నర్సాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. టూటౌన్ సీఐ సైదులు కథనం ప్రకారం... నర్సాపూర్ గ్రామానికి చెందిన తాళ్ల రామయ్య (60) తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్నాడు.
ఈ క్రమంలో గట్టుపై ఉన్న చెట్టు కొమ్మలను గొడ్డలితో నరుకుతుండగా అక్కడే పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్‌కు గురై, మంటలు చేలరేగి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్టు సీఐ తెలిపారు.