మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు
సాక్షి, నిజామాబాద్/నిజాంసాగర్(జుక్కల్) : అడవి పందుల బెడద నుంచి నారుమడి రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ కంచెకు అంటుకుని కౌలు రైతు ప్రాణాలు గాలిలో కలిశాయి. కరెంట్ కంచెకు తగిలి కొట్టుమిట్టాడుతున్న పాడి గేదెను కాపాడే ప్రయత్నంలో గైనికాడి గోవింద్‌రావ్(45) అనే కౌలు రైతు శనివారం ఉదయం మృతి చెందాడు. పిట్లం మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన గైనికాడి గోవింద్‌రావ్, నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామ శివారులో వ్యవసాయ భూములను కౌలుకు తీసుకున్నాడు. భూమి దుక్కి కోసం ట్రాక్టర్‌పై వెళ్లాడు.
తన భూమి పక్కనే ఉన్న నారుమడిలో మేత కోసం వెళ్లిన పాడిగేదె కంచెకు ఏర్పాటు చేసిన కరెంట్ అంటుకుంది. దీనిని గమనించిన గోవింద్‌రావ్ పాడిగేదెను కాపాడేందుకు కరెంట్ వైరును తొలగించే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు కరెంట్ తీగ చేతి వేళ్లకు అంటుకోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పంట పొలాలవైపు వెళ్లిన గ్రామస్తులు కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పంచనామా చేశారు.మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment