అప్పులబాధతో ఆగిన రైతన్న గుండె
కనగానపల్లి: అప్పుల బాధతో ఆందోళనకు గురైన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం కనగానపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన రైతు హరిజన పెద్దన్న (38)కు ఐదు ఎకరాల మెట్ట పొలం ఉంది. అప్పులు చేసి అందులోనే నాలుగు బోర్లు వేయించాడు. అరకొరగా వస్తున్న నీటితోనే కూరగాయలు సాగు చేశాడు.
అయితే ఆ నీరు చాలకపోవడం, వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పంటలు చేతికి రాలేదు. బోర్లు, పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.4 లక్షలకు చేరుకున్నాయి. ఓ వైపు అప్పులు, మరోవైపు కుటుంబ పోషణ భారం కావడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మార్గం మధ్యలో మృతి చెందాడు. రైతుకు భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు.