kanaganapalli
-
పరిటాల శ్రీరామ్.. మా తండ్రిని హత్య చేయించింది మీరు కాదా?
సాక్షి, కనగానపల్లి (అనంతపురం): తగరకుంట సర్పంచ్‌గా పనిచేసిన మా తండ్రి బోయ ముత్యాలప్పను రాజకీయ ఆధిపథ్యం కోసం మీ నాన్న పరిటాల రవీంద్ర హత్య చేయించింది నిజం కాదా ? అని ముత్యాలప్ప కుమారుడు వెంకటరాముడు పరిటాల శ్రీరామ్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఆయన కనగానపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ వాల్మీకులపై ప్రేమ ఒలకబోసినట్లు శ్రీరామ్ కట్టు కథలు చెపుతున్నాడన్నారు. మీ ఫ్యాక్షన్ రాజకీయాలతో ఐక్యంగా ఉన్న వాల్మీకులను విడగొట్టింది పరిటాల కుటుంబమే అన్నారు. కనగానపల్లి, రామగిరి మండలాల్లో ప్రతి గ్రామంలోనూ వాల్మీకుల మధ్య చిచ్చు పెట్టి వాళ్లు చంపుకొనేవరకు తీసుకొచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 2007 తర్వాతా రాజకీయాల్లోకి వచ్చిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తన సేవాభావంతో పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించటంతో పాటు మహిళలను ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. ఇక ఎమ్మెల్యే అయిన తర్వాతా నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులు చేయించటంతో పాటు పేరూరు డ్యాంకు కృష్ణ జలాలు తీసుకొచ్చిన అపర భగీరథుడు ప్రకాష్‌రెడ్డి అన్నారు. పేద ప్రజల కష్టాన్ని తీరుస్తున్న తోపుదుర్తి కుటుంబంపై అనవసరమైన ఆరోపణలు చేయటం మానుకోవాలని ఆయన పరిటాల శ్రీరామ్‌కు, టీడీపీ నాయకులకు సూచించారు. చదవండి: (‘బాబూ పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’) -
అంతులేని కథ.. తీరని వ్యథ
కష్టపడి డిగ్రీ వరకు చదువుకుని నలుగురికి విద్యాబుద్ధులు చెబుతూ జీవిద్దామనుకున్న ఆ యువకుడికి మూర్చవ్యాధి మృత్యుమార్గం చూపుతోంది. కాళ్లు, చేతులను చుట్టేసి మంచానికే పరిమితం చేసింది. వైద్యానికి ఉన్న కాస్త భూమి హారతి కర్పూరంలా కరిగిపోగా... వృద్ధాప్యంలో ఉన్న తల్లిపైనే ఆధారపడి బతకుతూ...నిత్యం నరకం అనుభవిస్తున్నాడా యువకుడు. కనగానపల్లి మండలం ముత్తువకుంట్ల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పక్కీరమ్మ, మారెన్న దంపతులకు నలుగురు కుమారులు. చాలాకాలం క్రితమే మారెన్న మృత్యువాత పడడంతో పక్కీరమ్మే కుటుంబ భారం మోయాల్సి వచ్చింది. చిన్న కుమారుడు కొడాల నరసింహులు చురుగ్గా ఉండడంతో కష్టపడి బాగా చదివించింది. తల్లి కష్టం చూసిన నర్సింహులు కూడా ఒకవైపు డిగ్రీ చదువుతూనే ఆర్డీటీ పాఠశాలలో పిల్లలకు ట్యూషన్ చెప్పుకొంటూ కుటుంబానికి సాయంగా ఉండేవాడు. అయితే మిగతా ముగ్గురు కూమారులు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోగా... పక్కీరమ్మ, నరసింహులు కలిసి ఉంటున్నారు. నరాల బలహీనతతో నరకం అయితే నరసింహులుకు 22 సంవత్సరాల వయస్సులో చిన్న మెదడులో నరాల బలహీనత ఏర్పడి కాళ్లు, చేతులు పనిచేయకుండా పోవటంతో పాటు నోట మాట కూడా సరిగా రాకుండా పోయింది. ఆర్డీటీ సహకారంతో బత్తలపల్లి, అనంతపురం ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నాడు. కానీ నయం కాకపోవడంతో డాక్టర్లు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్యం చేయించుకోవాలని సూచించారు. దీంతో వారికున్న ఐదు ఎకరాల పొలాన్ని విక్రయించి మూడు సంవత్సరాల పాటు అక్కడే ఉండి వైద్యం చేయించుకున్నాడు. కానీ చిన్న మెదడులో వచ్చిన స్పాస్టిక్ ఎటాక్సిక్ సిండ్రోమ్ (మెదడులోని నాళాలు దెబ్బతినటం) అనే సమస్య వల్ల నరాల బలహీనత ఏర్పడిందని, దీనివల్ల చేతులు, కాళ్లతో పాటు మిగిలిన అవయవాలు సరిగా పనిచేయవని వైద్యులు తెలిపారు. ఈ సమస్య త్వరగా నయం కాదని, అవసరమైన మందులు, సరైన ఆహారం, మంచి వ్యాయామం చేస్తే కొంతవరకు నయం చేసుకోవచ్చునని సూచించారు. అయితే అక్కడే చాలా రోజులు ఉండి వైద్యం చేయించుకోవడానికి అవసరమైన డబ్బులు లేక ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చేశాడు. అన్నీతానై... నరాల బలహీనతతో కాళ్లు, చేతులు సరిగా పనిచేయక నరసింహులు మంచం మీదే ఉండాల్సి వస్తోంది. దీంతో 80 ఏళ్ల వయస్సున్న పక్కీరమ్మే అన్నీ తానై కుమారుడిని చూసుకుంటోంది. వృద్ధాప్యంలో సరిగా కళ్లు కూడా కనిపించపోయినా కుమారుడిపై ఉన్న మమకారంతో అతనికి సేవలు చేయాల్సి వస్తోంది. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో తినేందుకు తిండికూడా లేక.. కుమారుడు నరసింహులుకు వైద్యం చేయించలేక పక్కీరమ్మ పడుతున్న బాధలు అన్నీ, ఇన్నీకావు. సమీప బంధువుల నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గాని ఎటువంటి సాయం అందటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆకలి బాధలతో జీవించటం కన్నా చావే నయమని కన్నీరుమున్నీరవుతోంది. మానవత్వం కలిగిన దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. సాయం చేయాలనుకుంటే.. కొడాల నరసింహులు తండ్రి: మారెప్ప ముత్తువకుంట్ల గ్రామం, కనగానపల్లి మండలం బ్యాంకు ఖాతా నంబరు: 31508584829 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కనగానపల్లి బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0005657 నరసింహులు సెల్ : 9666948405 -
అప్పులబాధతో ఆగిన రైతన్న గుండె
కనగానపల్లి: అప్పుల బాధతో ఆందోళనకు గురైన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం కనగానపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన రైతు హరిజన పెద్దన్న (38)కు ఐదు ఎకరాల మెట్ట పొలం ఉంది. అప్పులు చేసి అందులోనే నాలుగు బోర్లు వేయించాడు. అరకొరగా వస్తున్న నీటితోనే కూరగాయలు సాగు చేశాడు. అయితే ఆ నీరు చాలకపోవడం, వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పంటలు చేతికి రాలేదు. బోర్లు, పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.4 లక్షలకు చేరుకున్నాయి. ఓ వైపు అప్పులు, మరోవైపు కుటుంబ పోషణ భారం కావడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మార్గం మధ్యలో మృతి చెందాడు. రైతుకు భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు. -
అంతా మా ఇష్టం
- బస్టాండ్ వద్ద టీడీపీ మినీ మహానాడు సభ - వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం - నానా ఇబ్బందులు పడిన ప్రయాణికులు కనగానపల్లి (రాప్తాడు): అధికారం ఉంది కదా.. అని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ‘అంతా మా ఇష్టం’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రం కనగానపల్లిలో గురువారం టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. అయితే బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయాల్సిన సమావేశ ప్రాంగణాన్ని బస్టాండు కూడలిలో నిర్వహించారు. దీంతో వాహదారులు, ప్రయాణికులు అనేక అవస్థలు పడ్డారు. గ్రామంలోకి రావాల్సిన ఆర్టీసీ బస్సులు, ఆటోలు లోపలికి రాలేక ఎంపీడీఓ కార్యాలయం కూడలిలోనే ప్రయాణికులను దింపేశారు. ఫలితంగా ప్రయాణికులు మెయిన్ రోడ్డు నుంచి కనగానపల్లిలోకి కాలినడకన రావాల్సిన దుస్థితి నెలకొంది. అయితే మధ్యాహ్నం వేళ మండుటెండలో నడుచుకుని రాలేక వృద్థులు, మహిళలు నానా అవస్థలు పడ్డారు. బ్యాగులు, పిల్లలను ఎత్తుకుని రోడ్డుపై ఎండలో నిలుచోలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు భారీ స్పీకర్లు పెట్టి నిర్వహించని సభను పోలీస్‌స్టేషన్ పక్కనే నిర్వహించటంపై స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ రాజకీయ సభకు స్టేషన్ ఎదురుగా నిర్వహించుకునేందుకు అనుమతులు ఎలా ఇచ్చారని చర్చంచుకున్నారు. కాగా పోలీస్‌స్టేషన్ గోడలు, బోర్డులపైనే టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు కట్టినా పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. జనం కోసం బస్టాండ్ కూడలిలో సభ పెట్టి టీడీపీ నాయకులు ఎంత హడావుడి చేసినా సమావేశానికి అనుకున్నంత మంది రాకపోవడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరెళ్లబెట్టక తప్పలేదు. -
పాము కాటుతో విద్యార్థిని మృత్యువాత
కనగానపల్లి : పాముకాటుకు గురై విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండల కేంద్రం కనగానపల్లిలో జరిగింది. కేశవయ్య, సరస్వతి దంపతుల రెండవ కుమార్తె ఎం.గాయత్రి (11) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు సెలవకు కావడంతో వేరొక చోట ట్యూషన్‌కు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. తలనొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ వద్ద చూపించి ఆయనిచ్చిన మాత్రలు వేశారు. మంగళవారం ఉదయానికి గాయత్రి ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరోసారి ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. విషపురుగు కాటు వేసినట్టు ఉందని ఆర్ఎంపీ తెలిపాడు. దీంతో కుమార్తెను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు నాటువైద్యునికి దగ్గరకు తీసుకెళ్లారు. మందు ఇచ్చేలోప ఆరోగ్యం మరింత విషమిస్తుండటంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షలు చేసిన ఆరోగ్య సిబ్బంది గాయత్రి అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. సకాలంలో వైద్యం చేయించి ఉంటే ప్రాణాలునిలిచేవని పీహెచ్సీ డాక్టర్ నారాయణస్వామినాయక్ తెలిపారు. కళ్లెదుటే చనిపోయిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు రోదించారు. జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చి విద్యార్థిని మృతదేహానికి నివాళులర్పించారు. -
కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి
కనగానపల్లి : మామిళ్ల పల్లి గ్రామంలో సోమవారం ఊర కుక్కలు దాడి చేసి 15 గొర్రె పిల్లలను చంపేశాయి. వీటి విలువ రూ. 30 వేల వరకు ఉంటుందని బాధితుడు గొర్రెల కాపరి నారాయణస్వామి తెలిపాడు. ఇన్ని జీవాలు ఒకేసారి మృతి చెందటంతో జీవనోపాధి కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
ప్రాణం తీసిన పాము భయం
సడన్ బ్రేక్‌తో ఆటో బోల్తా ఒక ప్రయాణికుడు మృతి మరో ఏడుగురికి గాయాలు పోలీసుల అదుపులో డ్రైవర్ ముత్తువకుంట్ల నుంచి సోమవారం ప్యాసింజర్ ఆటో పది మంది ప్రయాణికులతో మండల కేంద్రం కనగానపల్లికి బయల్దేరింది. కోనాపురం దాటగానే రోడ్డుపై ఎదురుగా పాము కనిపించడంతో భయపడిపోయిన డ్రైవర్ తిరుపాలు సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న బాలేపాళ్యం గ్రామానికి చెందిన నడిపి నరిసింహులు (50), అక్కమ్మ, బొమ్మయ్య, శ్రీరాములు, రామస్వామి, పెద్దన్న, ప్రకాష్, నరిసింహులు గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని కనగానపల్లి ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వచ్చారు. తీవ్రంగా గాయపడిన నడిపి నరిసింహులు అప్పటికే మతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మిగిలిన వారికి ప్రథమ చికిత్స చేసి వారిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. మతుడి కుటుంబ సభ్యుల రోదనలతో కనగానపల్లి పీహెచ్సీ ఆవరణం దద్దరిల్లింది. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ తిరుపాలును పోలీసులు అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంకుడు గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
కనగానపల్లి (అనంతపురం జిల్లా) : కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామ శివారులో ఇంకుడుగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. తూముచెర్ల గ్రామానికి చెందిన మల్లేశ్, నిర్మల దంపతులు వ్యవసాయ కూలీలుగా పలిచేస్తున్నారు. సోమవారం ఉదయం యధావిధిగా ఇద్దరు పిల్లలు తేజ(9), తరుణ్(7)లను తీసుకుని కూలిపనులకు వెళ్లారు. దంపతులిద్దరూ పొలంలో పనిచేసుకుంటుండగా పిల్లలు ఆడుకుంటూ పక్కనే ఉన్న ఇంకుడుగుంతలో పడిపోయారు. పిల్లల అరుపులు విని వెళ్లేలోగానే వారిద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. ఇద్దరు పిల్లలు కళ్లముందే మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
మంత్రి సునీతను నిలదీసిన మహిళ
కనగానపల్లి: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతకు చుక్కెదురైంది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ముక్తాపురంలో మంగళవారం ‘జన్మభూమి-మా ఊరు’ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలను ప్రస్తావించకుండా ఒకరి తర్వాత మరొకరు మంత్రిని మాట్లాడాలని సూచిస్తూ వచ్చారు. ఇంతలో పార్వతమ్మ అనే మహిళ మాట్లాడుతూ.. ‘మీరు చెప్పే మాటలు బాగానే ఉన్నాయి. కానీ మా బాధలు కొన్ని వినండి’ అంటూ మంత్రి ముందుకు వెళ్లారు. ‘ప్రతి ఏటా ధర్మవరం కాలువ ద్వారా మా చెరువులకు నీరు వదులుతామని చెబుతున్నారు. మళ్లీ మీరే వెళ్లి పక్కకు తిప్పుతున్నారు. మా గ్రామం రైతులంతా ఇబ్బంది పడుతున్నారు.. మహిళా సంఘాల వాళ్లు రుణాలు కట్టవద్దని చంద్రబాబు చెబుతున్నారు. కానీ మాకు ఇంత వరకు ఏం న్యాయం జరిగింది?’ అని ప్రశ్నించింది. దీంతో కంగుతున్న మంత్రి ‘మీరు వెళ్లి సభలో కూర్చోండి. ఎవరో చెప్పిన మాటలు విని ఇలా మాట్లాడడం తగదు’ అని సర్ది చెప్పారు. అనంతరం సునీత మాట్లాడుతూ.. ధర్మవరం కాలువ ద్వారా త్వరలోనే అన్ని చెరువులకు నీరు వదులుతామన్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై కక్ష సాధింపు
కనగానపల్లె: సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసిన నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రత్యర్థులపై కక్ష సాధింపులు మొదలయ్యాయి. అనంతపురం జిల్లా కనగానపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సుబ్బరాయుడుకు చెందిన మామిడి తోటను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. 350 మామిడి చెట్లను నరికేశారు. ప్రత్యర్థులు తన తోటను ధ్వంసం చేయడంపై బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు.