మంత్రి సునీతను ప్రశ్నిస్తున్న పార్వతమ్మ
కనగానపల్లి: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతకు చుక్కెదురైంది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ముక్తాపురంలో మంగళవారం ‘జన్మభూమి-మా ఊరు’ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలను ప్రస్తావించకుండా ఒకరి తర్వాత మరొకరు మంత్రిని మాట్లాడాలని సూచిస్తూ వచ్చారు.
ఇంతలో పార్వతమ్మ అనే మహిళ మాట్లాడుతూ.. ‘మీరు చెప్పే మాటలు బాగానే ఉన్నాయి. కానీ మా బాధలు కొన్ని వినండి’ అంటూ మంత్రి ముందుకు వెళ్లారు. ‘ప్రతి ఏటా ధర్మవరం కాలువ ద్వారా మా చెరువులకు నీరు వదులుతామని చెబుతున్నారు. మళ్లీ మీరే వెళ్లి పక్కకు తిప్పుతున్నారు. మా గ్రామం రైతులంతా ఇబ్బంది పడుతున్నారు.. మహిళా సంఘాల వాళ్లు రుణాలు కట్టవద్దని చంద్రబాబు చెబుతున్నారు. కానీ మాకు ఇంత వరకు ఏం న్యాయం జరిగింది?’ అని ప్రశ్నించింది.
దీంతో కంగుతున్న మంత్రి ‘మీరు వెళ్లి సభలో కూర్చోండి. ఎవరో చెప్పిన మాటలు విని ఇలా మాట్లాడడం తగదు’ అని సర్ది చెప్పారు. అనంతరం సునీత మాట్లాడుతూ.. ధర్మవరం కాలువ ద్వారా త్వరలోనే అన్ని చెరువులకు నీరు వదులుతామన్నారు.