టీడీపీ: పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలైన విభేదాలు | Conflicts Exposed in Anantapur TDP Leaders On Party Emergence Day | Sakshi
Sakshi News home page

టీడీపీ: పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలైన విభేదాలు

Published Wed, Mar 30 2022 9:56 AM | Last Updated on Wed, Mar 30 2022 10:09 AM

Conflicts Exposed in Anantapur TDP Leaders On Party Emergence Day - Sakshi

సాక్షి, అనంతపురం: ‘అనంత’ టీడీపీ అతుకుల బొంతగా మారింది. ఒకప్పుడు కంచుకోటగా గొప్పలు చెప్పుకున్న జిల్లాలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అంతర్గత కుమ్ములాటతో కేడర్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  అధికారంలో ఉన్నన్నాళ్లూ విక్టరీలు చూపించిన నేతలంతా... 2019 ఎన్నికల్లో తర్వాత పార్టీకి..ప్రజలకూ పూర్తిగా దూరమయ్యారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నియోజక వర్గాలే సామంతరాజ్యాలుగా భావించి పావులు కదుపుతున్నారు.

ప్రతినియోజకవర్గంలోనూ రెండు మూడు గ్రూపులు. ఇద్దరు ముగ్గురు నాయకులు. మార్చి 29వ తేదీతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై ఏళ్లు నిండిన నేపథ్యంలో జిల్లాలో మంగళవారం జరిగిన పార్టీ కార్యక్రమాలు వర్గవిభేదాలకు అద్దం పట్టాయి. ఏ నియోజకవర్గంలోనూ నేతలంతా కలిసి ఒకే వేదికపైనుంచి కార్యక్రమాలు నిర్వహించిన దృశ్యం కనిపించలేదు. 

మడకశిరలో లుకలుకలు 
మడకశిర నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రెండు వర్గాల నాయకులను ఇటీవలే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలుపించుకుని మాట్లాడారు. కలిసి కట్టుగా పనిచేయాలని ఆదేశించారు. అయినా వేర్వేరుగానే అన్ని కార్యక్రమాలూ నిర్వహిస్తుండటంతో కార్యకర్తలు కూడా తలోవైపు వెళ్లిపోయారు.  


పెనుకొండలో బీకే పార్థసారథి లేకుండానే ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద సంబరాలు జరుపుతున్న సవిత

జేసీ..పరిటాలపై అసమ్మతి సెగలు 
జేసీ బ్రదర్స్‌ వ్యవహారంపై జిల్లాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిన్నటికి నిన్న పుట్టపర్తిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్‌ పల్లె రఘునాథరెడ్డికి కాకుండా మరొకరికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో వెంటనే పల్లె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు జేసీ వర్గానికి ప్రభాకర్‌చౌదరి వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జేసీ వర్గానికి అనంతపురంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌ ఇవ్వడానికి వీల్లేదంటూ జిల్లాలో చాలామంది పావులు కదుపుతున్నారు. ఇటీవల ప్రభాకర్‌ చౌదరి పాదయాత్ర చేస్తే ఎవరూ మద్దతు ఇవ్వలేదు. మరోవైవు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిని ఎట్టిపరిస్థితుల్లో పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదని పరిటాల శ్రీరాం తేల్చి చెప్పారు. బహిరంగంగానే సూరిపై  విమర్శలు చేశారు. 

గుంతకల్లులో నాలుగు స్తంభాలాట 
గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి స్తంభాలాటగా మారింది. గుంతకల్లులో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జితేంద్రగౌడ్‌ నాయకత్వంలో పరిటాల శ్రీరాములు కళ్యాణమండపంలోను, పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్‌ వర్గం బీరప్పగుడి సర్కిల్‌ సమీపంలోనూ వేడుకలు నిర్వహించారు. గుత్తిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడుయాదవ్‌ నేతృత్వంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి.

వాస్తవానికి వెంకటశివుడుయాదవ్, బండారు ఆనంద్‌కు పార్టీ ఇన్‌చార్జి జితేంద్రగౌడ్‌ నుంచి ఎలాంటి ఆహ్వానం కానీ సమాచారం కానీ అందలేదని తెలుస్తోంది. ఈ నలుగురు నాయకులు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. ఇప్పటి నుంచే పార్టీ కేడర్‌పై పెత్తనం కోసం పావులు కదుపుతున్నారు. 


గుంతకల్లులో బండారు ఆనంద్‌ నేతృత్వంలో టీడీపీ జెండాను ఆవిష్కరిస్తున్న దృశ్యం 

పెనుకొండలో ఎడమొహం.. పెడమొహం 
పెనుకొండలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కురుబ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ సవిత ఎడమొహం పెడమొహంగా కనిపించారు. స్కూటర్‌ ర్యాలీలోనూ అలాగే వ్యవహరించారు.  వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తమకంటే తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటుండటంతో కేడర్‌ అయోమయంలో పడింది. ఇదిలా ఉండగా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పార్టీ ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉన్నారు. బీకే వ్యవహారం నచ్చకే ఆయన ఇంటికి పరిమితమయ్యారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 

అటు అత్తార్‌..ఇటు కందింకుట  
కదిరిలో రెండు గ్రూపులుగా విడిపోయి టీడీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ తన అనుచరులతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించగా, మరో వైపు మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా తన వర్గంతో కలిసి అత్తార్‌ రెసిడెన్సీలో సమావేశం నిర్వహించారు. కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి అత్తార్‌ చాంద్‌బాషా అంటూ అనుచరులు గట్టిగా నినాదాలు చేశారు. ఇంకోవైపు కందికుంట వర్గం ఈసారి కూడా టికెట్‌ కందికుంట అన్నకే..అని ఈలలు, కేకలు వేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.   

రాయదుర్గంలో ఉనికి కోసం..
రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ వేడుకలకు వస్తే రూ.500తో పాటు మద్యం పంపిణీ చేస్తామని గుమ్మఘట్టకు చెందిన ఓ నాయకుడు కార్యకర్తలకు నమ్మబలికాడు. వచ్చిన తర్వాత నగదు ఇచ్చి మద్యం పంపిణీని విస్మరించడంతో కార్యకర్తలు మద్యం షాపుల వద్ద బండ బూతులు తిట్టారు. రాయదుర్గంలో కూడా రూ.300 నగదు, మద్యం ఇస్తామని చెప్పి మాట తప్పారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఎవరికి వారే యమునా తీరే.. 
కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, మహేశ్వర నాయుడు ఎవరికి వారు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా గ్రూపులుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఎటు వెళ్లాలో తెలియక కొందరు దూరంగా వెళ్లిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement