అంతా మా ఇష్టం
- బస్టాండ్ వద్ద టీడీపీ మినీ మహానాడు సభ
- వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం
- నానా ఇబ్బందులు పడిన ప్రయాణికులు
కనగానపల్లి (రాప్తాడు): అధికారం ఉంది కదా.. అని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ‘అంతా మా ఇష్టం’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రం కనగానపల్లిలో గురువారం టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. అయితే బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయాల్సిన సమావేశ ప్రాంగణాన్ని బస్టాండు కూడలిలో నిర్వహించారు. దీంతో వాహదారులు, ప్రయాణికులు అనేక అవస్థలు పడ్డారు. గ్రామంలోకి రావాల్సిన ఆర్టీసీ బస్సులు, ఆటోలు లోపలికి రాలేక ఎంపీడీఓ కార్యాలయం కూడలిలోనే ప్రయాణికులను దింపేశారు. ఫలితంగా ప్రయాణికులు మెయిన్ రోడ్డు నుంచి కనగానపల్లిలోకి కాలినడకన రావాల్సిన దుస్థితి నెలకొంది. అయితే మధ్యాహ్నం వేళ మండుటెండలో నడుచుకుని రాలేక వృద్థులు, మహిళలు నానా అవస్థలు పడ్డారు. బ్యాగులు, పిల్లలను ఎత్తుకుని రోడ్డుపై ఎండలో నిలుచోలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి తోడు భారీ స్పీకర్లు పెట్టి నిర్వహించని సభను పోలీస్‌స్టేషన్ పక్కనే నిర్వహించటంపై స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ రాజకీయ సభకు స్టేషన్ ఎదురుగా నిర్వహించుకునేందుకు అనుమతులు ఎలా ఇచ్చారని చర్చంచుకున్నారు. కాగా పోలీస్‌స్టేషన్ గోడలు, బోర్డులపైనే టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు కట్టినా పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. జనం కోసం బస్టాండ్ కూడలిలో సభ పెట్టి టీడీపీ నాయకులు ఎంత హడావుడి చేసినా సమావేశానికి అనుకున్నంత మంది రాకపోవడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరెళ్లబెట్టక తప్పలేదు.