ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. మినీ మహానాడు వేదికలుగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నేతలు జిల్లా మంత్రులను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అధికార దాహంతో టీడీపీలో చేరిన కొత్త, పాత నేతల మధ్య గ్రూప్ విబేధాలు, వర్గ పోరు నిత్యకృత్యంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నియోజక వర్గాల్లో నిర్వహించిన మినీ మహానాడుల్లో అనేక చోట్ల నేతల మధ్య విభేదాలు, అసంతృప్తి తీవ్రస్థాయిలో భగ్గుమనగా, మరికొన్ని చోట్ల అయితే ప్రత్యక్ష విమర్శలతో జిల్లా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. కొన్ని నియోజకవర్గాలకు మంత్రులు, జిల్లా అధ్యక్షుడు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో గురువారం నెల్లూరునగరంలో జిల్లా మహానాడు జరగనుంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. నిత్యం పర్యటనలు, సమీక్షలు అంటూ హడావుడి తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పార్టీలో ఇద్దరు నేతలు తాత్కాలిక ప్రయోజనాల కోసం కలిసినట్లుగా కనిపిస్తారు తప్ప ఎవరికి వారే యమునా తీరే చందంగా రాజకీయాలు సాగిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు మొదలుకొని జిల్లాకు రాష్ట్ర మంత్రుల వరకు ఇదే వైఖరి కొనసాగుతుంది. మంత్రులు సోమరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. పి.నారాయణలు ఎదురు పడితే మాట్లాడుకోవటం మినహా గడిచిన నాలుగేళ్లలో ఏకతాటిపై పని చేసింది లేదు. ఎవరికి వారే జిల్లాపై పెత్తనం కోసం పాకులాడుతూనే ఉన్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే
సమయం ఉంటడం ప్రస్తుతం అధికారంలో ఉండి టీడీపీ చివరిగా నిర్వహించే మహానాడు కావటంతో లోటుపాట్లపైనే ఎక్కువగా చర్చ సాగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో జరిగిన మినీ మహానాడులు వేదికగా అనేక చోట్ల వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరుతో మొదలైన ఈ సంఘర్షణలు కోవూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్ వరకు కొనసాగింది. కొన్ని చోట్ల పరోక్ష విమర్శలు ఉంటే మరికొన్ని చోట్ల ప్రత్యక్ష విమర్శలు కొనసాగిన నేపథ్యంలో జిల్లా అధికార పార్టీలో గత వారం రోజులుగా నేతల తీరు, జరగుతున్న పరిణామాలపై తీవ్రస్థాయిలో చర్చ కొనసాగుతోంది.
మంత్రి సోమిరెడ్డిని టార్గెట్ చేసిన ఆనం
ఆత్మకూరు మినీ మహానాడులో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రత్యక్షంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. వాస్తవానికి విమర్శల విషయం పక్కన పెడితే ఇద్దరికి సుదీర్ఘ కాలంగా రాజకీయ వైరం ఉండటంతో పాటు తాజాగా ఆనం టీడీపీలో చేరినప్పటి నుంచి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఆత్మకూరులో కన్నబాబును మంత్రి సోమరెడ్డి ప్రోత్సహించి తన ప్రాధాన్యత తగ్గిస్తున్నారనేది బలమైన కారణంగా ఉంది. సీఎం చంద్రబాబుకు అనేక మార్లు ఫిర్యాదులు చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవటంతో అందరిని టార్గెట్ చేసి బహిరంగ వేదికలపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆత్మకూరులో మంత్రి సోమిరెడ్డిని విమర్శిస్తూ పనిలో పనిగా మంత్రి నారాయణను ఇరకాటంలో పడేశారు. జిల్లాలో జరిగేదంతా సీఎంకు మీరే చెప్పండి అంటూ ఆయన్ను బాధ్యుడ్ని చేయడంతో ఆ తర్వాత జరిగిన మినీ మహానాడులకు మంత్రి నారాయణ దూరంగా ఉన్నారు. ఇసుక అక్రమ రవాణా, సిలికా వ్యాపారం, రేషన్ మాఫియా, ఎర్ర చందనం అక్రమ రవాణా వెనుక కీలక అధికార పార్టీ నేతలు ఉన్నారనది బహిరంగ సత్యం. ఈ క్రమంలో ఆనం వాటిపైనా మాట్లాడటంతో పార్టీ కీలక నేతలందరికీ ఆనం వ్యాఖ్యలతో సెగ తగిలింది. అయితే ఇప్పటి వరకు వీటిపై మంత్రి సోమిరెడ్డి కానీ ఆయన వర్గం కానీ ఒక్కమాట కూడా మాట్లాకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
అదే బాటలో మాజీ మంత్రి ఆదాల
ఇక మంత్రి సోమరెడ్డిని మొదటి నుంచి రాజకీయంగా ఆదాల ప్రభాకరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆదాలకు జిల్లా పార్టీ కనీస ప్రాధాన్యత లేకపోవటంతో నెల్లూరురూరల్ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. మంత్రి సోమరెడ్డి తీరుపై రెండు..మూడు సార్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తే ఆయన నేతలందరికీ సీరియస్‌గా క్లాస్ తీసుకున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇక ఇదే అసంతప్తితో పార్టీ సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోలంరెడ్డికి సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి మధ్య ఉన్న వర్గ విభేదాల నేపథ్యంలో పెళ్లకూరుకు మినీమహానాడుకు ఆహ్వానం లేదు. మంత్రి సోమిరెడ్డి ఒత్తిడితో అలా వెళ్లి ఇలా వచ్చారు. ఉదయగిరి నియోజక వర్గ మహానాడుకు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డికి ఆహ్వానం అందని పరిస్థితి.
బీద మౌనపాత్ర
జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో గొడవల్ని సర్దుబాటు చేసి వివాదాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సిన జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మౌనప్రాత పోషిస్తున్నారు. ఈయన పార్టీలో వివాదాలకు దూరంగా, సమస్యలు తీవ్రమైనప్పుడు ఎవరికి దొరకరనే ఆరోపణ ఉంది. ప్రస్తుతం వర్గ విభేదాలు, వివాదాలు పడుతున్న నేతలంతా సీనియర్లు, రాష్ట్రస్థాయి నేతలు కావటంతో అన్నింటికి దూరం దూరంగా ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment