టీడీపీ మినీమహానాడు సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
పులివెందుల/రూరల్ : పులివెందుల పట్టణంలోని శిల్పారామంలో జరిగిన టీడీపీ జిల్లా మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సోమవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్యక్షతన జిల్లా మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జమ్మలమడుగు టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పరోక్షంగా మంత్రి ఆదినారాయణరెడ్డిపై విరుచుకుపడ్డారు. రాజకీయాలు అనేవి.. ప్రజలకు సేవ చేసేందుకే కానీ.. పెత్తనం చెలాయించేందుకు కాదని మంత్రి ఆదిపై పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే తాము పార్టీ స్థాపించినప్పటినుంచి ఉన్నామని.. వీరారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తాను జిల్లా అధ్యక్షునిగా పనిచేశానని తెలిపారు.
ఇటీవల కొంతమంది స్టేట్‌మెంట్లు చూస్తే తనకు బాధగా ఉందని.. మహానాడును ఒక పండుగగా జరుపుకుంటున్నామని.. ఇక్కడ కొన్ని విషయాలు తాను మాట్లాడాలనుకుంటున్నా.. పార్టీ మీద ఉన్న గౌరవంతో మాట్లాడలేకపోతున్నానని పేర్కొన్నారు. ఒకవేళ మాట్లాడితే చంద్రబాబుకు మచ్చ తెచ్చే విధంగా ఉంటుందన్నారు. పదేళ్లపాటు ప్రభుత్వం లేకున్నా.. ఎన్నో అవాంతరాలు ఎదురైనా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎదుర్కొన్నామేతప్ప.. పార్టీని వీడలేదన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా.. ఎన్నో త్యాగాలు చేసి నష్టాలను ఎదుర్కొని.. పార్టీకి, ప్రజలకు సేవ చేశామన్నారు. ఇప్పటికి కూడా తమ పార్టీ నాయకులు కొంతమంది జైళ్లలోనే ఉన్నారన్నారు. తాను కూడా రెండేళ్లపాటు జైలులో ఉన్నా కూడా.. తమ ఇంటిలోని ఆడవాళ్లు రాజకీయం నడిపారన్నారు. ముఖ్యమంత్రి చెప్పడంతోనే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని గౌరవిస్తున్నామన్నారు. వారు పార్టీలో ఉన్నవాళ్లను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే పార్టీకి నష్టం కలుగుతుందని ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి అన్నారు. రామ సుబ్బారెడ్డి ఆదినారాయణరెడ్డిపై వ్యాఖ్యలు చేస్తుంటే పెద్ద ఎత్తున ఈలలు, కేకలతో సభా ప్రాంగణం మారుమోగింది. అంతకుముందు వేదికపై ఉన్న నాయకుల పేర్లు చెబుతున్నప్పుడు మంత్రి ఆది పేరు ప్రస్తావించకపోవడం కొసమెరుపు.
ఎన్ని పుంగనూర్లు అయితే ఒక బెంగళూరవుతుంది.. : సీఎం రమేష్ నాయుడు
టీడీపీ మినీ మహానాడులో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు కూడా మంత్రి ఆదిపై పరోక్ష విమర్శలు చేశారు. తనను రెండవసారి ముఖ్యమంత్రి రాజ్యసభకు ఎంపిక చేశారన్నారు. రాజ్యసభకు ఎంపిక చేయడమంటే.. 45మంది ఎమ్మెల్యేలు బలపరచాలన్నారు. 45మంది ఎమ్మెల్యేలంటే.. 7మంది పార్లమెంటు సభ్యులతో సమానమన్నారు. అంటే దీని అర్థం ఎన్ని పుంగనూర్లు అయితే ఒక బెంగళూరవుతుందో తెలుసుకోవాలని మంత్రి ఆదిని ఉద్దేశించి పరోక్షంగా పేర్కొన్నారు. ఇటీవల ఆదినారాయణరెడ్డి సీఎం రమేష్‌పై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అక్కడి కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది.
సీఎం నన్ను ఆహ్వానించారు : ఆది
టీడీపీ మినీ మహానాడులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యడు సీఎం రమేష్‌నాయుడుల ప్రసంగాలు ముగిసిన తర్వాత మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ నేను ఎవరిని పార్టీలో చేర్చుకోమని అడగలేదని.. ముఖ్యమంత్రే స్వయంగా తనను పిలిపించుకుని 45నిమిషాలు మాట్లాడి పార్టీలో చేర్చుకున్నారన్నారు. అనంతరం ఆయనే తనకు మంత్రి పదవి ఇచ్చారని వారు చేసిన విమర్శలకు సభాముఖంగా సమాధానం చెప్పారు. పార్టీ నేతలు ఈ విధంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు.
రక్తదాన శిబిరానికి స్పందన కరువు : పులివెందుల శిల్పారామంలో సోమవారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతలు సభా ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి తెలుగు తమ్ముళ్ల నుంచి స్పందన కరువైంది. మధ్యాహ్నం 1గంట సమయానికి కూడా ఒకరు కూడా రక్తదానం చేయకపోవడంతో రక్తదాన నిర్వాహకులు స్థానిక పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. తూ తూ మంత్రంగా కేవలం పది మంది మాత్రమే రక్తదానం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment