లింగారెడ్డి ఇంటి వద్ద నాయకులతో మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన మినీ మహానాడుకు లింగారెడ్డి వర్గం, ఎంపీ రమేష్ వర్గం గైర్హాజరయ్యారు. మినీ మహానాడుకు రావాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి లింగారెడ్డి ఇంటికి వచ్చి ఆహ్వానించినా, సమస్యను పరిష్కరించలేనప్పుడు తాము ఎలా వస్తామని ఆయనను నిలదీశారు. ప్రతి విషయంలో లింగారెడ్డి వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా వరదరాజులరెడ్డి వ్యవహరిస్తున్నారని ఇప్పటికే చాలా సార్లు జిల్లా అధ్యక్షునితోపాటు ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఆసం రఘురామిరెడ్డిని చైర్మన్‌ను చేస్తే తనకు ఇన్‌చార్జి పదవి కూడా వద్దని వరదరాజులరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పెద్దల సమక్షంలో చెప్పారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఇన్‌చార్జి పదవిని వదులుకోలేదు. పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవుల్లో వరద వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తుండటం లింగారెడ్డి వర్గానికి మింగుడు పడటం లేదు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లింగారెడ్డి వర్గీయ కౌన్సిలర్లకు ప్రాధాన్యత లేకుండా చేశారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో మినీ మహానాడు వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి, వరద వర్గీయ కౌన్సిలర్లు, నాయకులు మాత్రమే హాజరయ్యారు.
లింగారెడ్డి ఇంటికి జిల్లా అధ్యక్షుడు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మంగళవారం సాయంత్రం వైఎంఆర్ కాలనీలోని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఇంటికి వచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీఎస్ ముక్తియార్, టీడీపీ పట్టణాధ్యక్షుడు ఈవీ సుధాకరరెడ్డి, వర్గీయ కౌన్సిలర్లు, నాయకులతో మాట్లాడారు. మినీ మహానాడుకు రావాలని పిలిచారు. లింగారెడ్డి వర్గీయులు జిల్లా అధ్యక్షుడిని పలు సమస్యలపై నిలదీశారు. వరదరాజులరెడ్డి వేధింపులు తట్టుకోలేకపోతున్నామని చెప్పారు. రాజుపాళెం మండలంలో చేపట్టిన బైక్ ర్యాలీకి తన వెంట వచ్చారని, పార్టీ కార్యకర్తలపై విద్యుత్ అధికారులతో దాడులు చేయించి భయబ్రాంతులకు గురిచేయించాడని ఫిర్యాదు చేశారు. తనకు చెందిన కళాశాల స్థలాన్ని దేవాదాయశాఖాధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని వరదరాజులరెడ్డి పురమాయించడం నీచమైన చర్య అని జిల్లా అధ్యక్షునికి చెప్పారు.
ఫ్లె్లక్సీల్లో మాజీ ఎమ్మెల్యేనైన తన ఫొటో, రాష్ట్ర కార్యదర్శి ముక్తియార్ ఫొటో ముద్రించలేదని, వరద కొడుకు, మనువడి ఫొటోలు ఏ హోదాలో వేశారని జిల్లా అధ్యక్షుడిని ప్రశ్నించారు. ప్రజలందరూ పార్కులో ట్యాంకు నిర్మాణం వద్దంటుంటే వరదరాజులరెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా పార్కులోనే ట్యాంకు నిర్మిస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డిని పిలిపించి చెప్పించడం ఏమిటని ప్రశ్నించారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇస్తామంటే మినీ మహానాడుకు వస్తామని తేల్చి చెప్పారు. తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని జిల్లా అధ్యక్షుడు చెప్పారు. ఎలాంటి హామీ ఇవ్వనప్పుడు మేము ఎలా మినీ మహానాడుకు వస్తామని లింగారెడ్డి వాదించారు. దీంతో లింగారెడ్డి ఇంటి నుంచి ఆయన వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment