Class fighting
-
టీడీపీలో ముదిరిన వర్గ పోరు
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన మినీ మహానాడుకు లింగారెడ్డి వర్గం, ఎంపీ రమేష్ వర్గం గైర్హాజరయ్యారు. మినీ మహానాడుకు రావాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి లింగారెడ్డి ఇంటికి వచ్చి ఆహ్వానించినా, సమస్యను పరిష్కరించలేనప్పుడు తాము ఎలా వస్తామని ఆయనను నిలదీశారు. ప్రతి విషయంలో లింగారెడ్డి వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా వరదరాజులరెడ్డి వ్యవహరిస్తున్నారని ఇప్పటికే చాలా సార్లు జిల్లా అధ్యక్షునితోపాటు ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఆసం రఘురామిరెడ్డిని చైర్మన్‌ను చేస్తే తనకు ఇన్చార్జి పదవి కూడా వద్దని వరదరాజులరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పెద్దల సమక్షంలో చెప్పారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఇన్చార్జి పదవిని వదులుకోలేదు. పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవుల్లో వరద వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తుండటం లింగారెడ్డి వర్గానికి మింగుడు పడటం లేదు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లింగారెడ్డి వర్గీయ కౌన్సిలర్లకు ప్రాధాన్యత లేకుండా చేశారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో మినీ మహానాడు వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి, వరద వర్గీయ కౌన్సిలర్లు, నాయకులు మాత్రమే హాజరయ్యారు. లింగారెడ్డి ఇంటికి జిల్లా అధ్యక్షుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మంగళవారం సాయంత్రం వైఎంఆర్ కాలనీలోని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఇంటికి వచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీఎస్ ముక్తియార్, టీడీపీ పట్టణాధ్యక్షుడు ఈవీ సుధాకరరెడ్డి, వర్గీయ కౌన్సిలర్లు, నాయకులతో మాట్లాడారు. మినీ మహానాడుకు రావాలని పిలిచారు. లింగారెడ్డి వర్గీయులు జిల్లా అధ్యక్షుడిని పలు సమస్యలపై నిలదీశారు. వరదరాజులరెడ్డి వేధింపులు తట్టుకోలేకపోతున్నామని చెప్పారు. రాజుపాళెం మండలంలో చేపట్టిన బైక్ ర్యాలీకి తన వెంట వచ్చారని, పార్టీ కార్యకర్తలపై విద్యుత్ అధికారులతో దాడులు చేయించి భయబ్రాంతులకు గురిచేయించాడని ఫిర్యాదు చేశారు. తనకు చెందిన కళాశాల స్థలాన్ని దేవాదాయశాఖాధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని వరదరాజులరెడ్డి పురమాయించడం నీచమైన చర్య అని జిల్లా అధ్యక్షునికి చెప్పారు. ఫ్లె్లక్సీల్లో మాజీ ఎమ్మెల్యేనైన తన ఫొటో, రాష్ట్ర కార్యదర్శి ముక్తియార్ ఫొటో ముద్రించలేదని, వరద కొడుకు, మనువడి ఫొటోలు ఏ హోదాలో వేశారని జిల్లా అధ్యక్షుడిని ప్రశ్నించారు. ప్రజలందరూ పార్కులో ట్యాంకు నిర్మాణం వద్దంటుంటే వరదరాజులరెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా పార్కులోనే ట్యాంకు నిర్మిస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డిని పిలిపించి చెప్పించడం ఏమిటని ప్రశ్నించారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇస్తామంటే మినీ మహానాడుకు వస్తామని తేల్చి చెప్పారు. తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని జిల్లా అధ్యక్షుడు చెప్పారు. ఎలాంటి హామీ ఇవ్వనప్పుడు మేము ఎలా మినీ మహానాడుకు వస్తామని లింగారెడ్డి వాదించారు. దీంతో లింగారెడ్డి ఇంటి నుంచి ఆయన వెళ్లిపోయారు. -
మేమింతే!
తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ముదిరి పాకాన పడింది. నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అధినేతకు ఫిర్యాదులతో బజారుకెక్కుతున్నారు. పెద్దదిక్కుగా వ్యవహరించాల్సిన మంత్రులే పోరుకు సారథ్యం వహిస్తున్నారు. స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ జిల్లా సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ఇక టిక్కెట్లు దక్కవనే నైరాశ్యం కొందరు ఎమ్మెల్యేలను ఇంటికే పరిమితం చేస్తోంది. మొత్తంగా ‘తమ్ముళ్ల రాజకీయం’ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు చుక్కలు చూపుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: వర్గ విభేదాలతో టీడీపీ శ్రేణులు రెండుగా చీలిపోగా.. నేతల ఆధిపత్య పోరుతో పార్టీ పరువును దిగజారుస్తోంది. అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ అగాథం నగర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత మూడున్నరేళ్లలో వీరిద్దరూ ఏమి చేశారనే ప్రశ్న వేసుకుంటే మౌనమే సమాధానమవుతోంది. కదిరిలో అత్తార్, కందికుంట ప్రసాద్ ఇప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. పెనుకొండలో బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్పల మధ్య ఆధిపత్య పోరు పార్టీ పునాదులను కుదిపేస్తోంది. రాయదుర్గం, తాడిపత్రి, పుట్టపర్తితో పాటు పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందనే విషయం తెలుసుకున్న చంద్రబాబు 8–10 నెలల కిందట నేతలందరినీ అమరావతికి పిలిపించి ‘క్లాస్’ తీసుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే పార్టీ బలం అనంతపురంలో ఎలా ఉందో ఎప్పటికప్పుడు తాను రిపోర్టులు తెప్పించుకుని పరిశీలిస్తున్నానని చెప్పి.. అప్పట్లో రిపోర్టులు బయటపెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీకి 20–30 శాతం లోపు నష్టం వాట్లిల్లితే.. కృష్ణా జిల్లాలో 56శాతం, గుంటూరులో 52శాతం నష్టం జరిగిందనే రిపోర్టలతో కంగారు పడ్డానన్నారు. ఇందుకు భిన్నంగా అనంతపురంలో పార్టీకి జరిగిన నష్టం 92శాతం ఉందనే రిపోర్టు తనను కలవర పర్చిందని ఆ సందర్భంగా నేతలపై సీఎం చిర్రుబుర్రులాడినట్లు తెలిసింది. అయితే ఇప్పటికీ నాయకుల తీరులో మార్పు లేకపోవడం గమనార్హం. ‘అనంత’లో తారాస్థాయికి ఆధిపత్య పోరు 2019 ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టిక్కెట్టు దక్కకుండా చేసేందుకు జేసీ దివాకర్‌రెడ్డి మొదటి నుంచి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో గురునాథరెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశ చూపి టీడీపీలోకి తీసుకొచ్చారు. దీంతో పాటు తనవర్గం కార్పొరేటర్లతో మేయర్ స్వరూపను కూడా ఇబ్బంది పెట్టడుతున్నారు. ఫలితంగా ‘అనంత’లో టీడీపీ మూడు ముక్కలైంది. చౌదరికి టిక్కెట్టు రాకూడదని జేసీ వర్గీయులైన కోగటం విజయభాస్కర్‌రెడ్డి, జయరాంనాయుడుతో పాటు మరికొందరు నేతలు ఇన్ని రోజులు పని చేశారు. ఇప్పుడు గురునాథ్‌రెడ్డి రూపంలో చౌదరికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ఆయనకు టిక్కెట్టుకు ఇస్తే ప్రభాకర్‌చౌదరి అసలు టీడీపీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, మేయర్ కలిసి కార్పొరేషన్లో విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని దివాకర్‌రెడ్డి ఏకంగా పలుసార్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. దివాకర్‌రెడ్డి వైఖరితో పార్టీకి నష్టం వాటిల్లుతోందని మేయర్, ఎమ్మెల్యే కూడా బాహాటంగానే విమర్శిస్తున్నారు. కదిరిలో రచ్చ...రచ్చ.. కదిరిలో వైఎస్సార్సీపీ నుంచి వలస వెళ్లిన చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంటప్రసాద్ల మధ్య వివాదం ముదిరిపాకన పడింది. అత్తార్ రాకను జీర్ణించుకోలేని కందికుంట, ఆయన వర్గం ప్రతీ అంశంలోనూ చాంద్‌బాషాను విభేదిస్తున్నారు. చాంద్‌బాషా కూడా టీడీపీ కేడర్‌తో సర్దుకునిపోలేక తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పర్చుకునేందుకు పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కదిరిలో మొదటి నుంచి టీడీపీ బలహీనంగా ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య విభేదాలతో మరింత బలహీనపడింది. కందికుంటకు చెక్‌బౌన్స్ కేసులో శిక్షపడటంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు విషయంలో తనకు పోటీ లేదని నేతలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చాంద్‌బాషా చేస్తున్నారు. కార్పొరేటర్స్థాయి కూడా లేని చాంద్‌బాషాను ఎమ్మెల్యేని చేస్తే పార్టీకి ద్రోహం చేసి టీడీపీలో చేరారని, ఆయన్ను నమ్మి చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చే ప్రసక్తే లేదని కందికుంట ప్రచారం చేస్తున్నారు. వరదాపురం వర్సెస్ పరిటాల ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల వర్గీయుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు మంత్రి సునీతతో వరదాపురం సూరి పూర్తిగా విభేదిస్తున్నారు. ఇరువర్గాల మధ్య ధర్మవరంలో పలుసార్లు ఘర్షణ కూడా జరిగింది. ఇద్దరినీ పిలిపించి సీఎం క్లాస్ తీసుకుంటే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా తీరు మారని పరిస్థితి. ఇటీవల మాల్యవంతంలో జాతరకు పరిటాల శ్రీరామ్ వెళ్లారు. ఇదే సమయంలో సూరితో పాటు బీకే పార్థసారథి వచ్చారు. ఇద్దరూ ఎదురుపడ్డా పలకరించుకోకుండా వెళ్లిపోయారు. ధర్మవరంలో సూరికి ఎలాగైనా చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో పరిటాల వర్గం వ్యూహం రచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలైన ధర్మవరం, రాప్తాడులో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు ఏస్థాయిలోకి వెళతాయోనని అక్కడి జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. అన్నిచోట్లా ఇంతే.. రాయదుర్గంలో ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డిని మంత్రి కాలవ పూర్తిగా పక్కనపెట్టారు. ఎన్నికల్లో సహకరించిన పాపానికి కాలవ తనను పూర్తిగా పక్కనపెడుతున్నారని మెట్టు కూడా అసంతృప్తితో ఉన్నారు. దీపక్‌రెడ్డి, గోవిందరెడ్డి కలిసి ఇద్దరిలో ఎవరో ఒకరం టిక్కెట్టు తెచ్చుకుందాం.. కాలవకు మాత్రం రాకూడదనే రీతిలో పని చేస్తున్నట్లు సమాచారం. గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జేసీ వర్గం సహకరించింది. ఈ సాన్నిహిత్యంతో కాలవకు వ్యతిరేకంగా ఇద్దరూ ఏకమయ్యారు. ఇది గ్రహించిన కాలవ విభేదాల మధ్య, కాపు రామచంద్రారెడ్డిపై గెలవడం కష్టమనే యోచనతో గుంతకల్లు బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మడకశిరలో ఎమ్మెల్యే ఈరన్నను పూర్తిగా పక్కనపెట్టి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఇది ఈరన్న జీర్ణించుకోలేకపోతున్నారు. విభేదాల పరిస్థితి ఇలా ఉంటే మంత్రులతో పాటు చీఫ్‌విప్, విప్ అంతా కలిసి జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని టీడీపీ ప్రజాప్రతినిధులపై ‘అనంత’వాసుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటరీ, హెచ్చెల్సీ నీటి వాటాల్లో అలసత్వం, తదితర అంశాలతో పాటు జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం ఆలోచన లేదని, నేతలు ఆర్థికంగా ఎదగడం మినహా ఇంకేదీ లేదనే బాధ ప్రజల్లో కనిపిస్తోంది. -
అయిననూ పోయిరావలె అమరావతికి
♦ పీతలపై అమీతుమీకి సిద్ధమవుతున్న అసమ్మతి నేతలు ♦ చింతలపూడి సెగ్మెంట్లో మాగంటి, పీతల మధ్య వర్గ పోరు ♦ ఆదివారం ఇన్చార్జ్ మంత్రి పత్తిపాటి సమక్షంలో పంచాయితీ చింతలపూడి : చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి నిప్పు రాజుకుంటోంది. వారం రోజుల క్రితం ఏలూరు అతిథి హోటల్లో నాలుగు మండలాల ముఖ్య నేతలతో పాటు నాలుగు మండలాల జెడ్పీటీసీ సభ్యులు, పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు సమావేశమై స్థానిక శాసనసభ్యురాలు పీతల సుజాతపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే మరుసటి రోజు జంగారెడ్డిగూడెంలో వీరంతా సమావేశమై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయానికి రావడంతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఫోన్ చేసి ఆదివారం అసమ్మతి నాయకులను అమరావతి రమ్మని సూచించడంతో తెలుగు తమ్ముళ్ల పంచాయితీ అమరావతికి చేరింది. అమరావతిలో కూడా సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే వారం చింతలపూడిలో జరిగే టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో అసంతృప్తులంతా అమీతుమీకి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఏఎంసీ వేదికగా : నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరుకు ఏఎంసీ కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో మార్కెట్ కమిటీ పాలకవర్గాలన్నీ భర్తీ అయిపోయినా గత మూడున్నర ఏళ్లుగా చింతలపూడి ఏఎంసీ పాలకవర్గం మాత్రం భర్తీ చేయడం లేదు. ఏఎంసీ ఛైర్మన్ పదవిని తమవర్గానికి చెందిన వ్యక్తికి ఇప్పించుకోవడానికి ఎంపీ మాగంటి బాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. దానికి సుజాత చెక్ పెట్టడంతో ఎంపీ మాగంటి, ఎమ్మెల్యే సుజాత వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపధ్యంలోనే సుజాత మంత్రి పదవి పోవడానికి జిల్లాలోని ఒక బలమైన సామాజిక వర్గ నేతల ప్రమేయం ఉందనేది పీతల వర్గం ఆరోపణ. ఆమె మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఎంపీ మాగంటితో పాటు ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సుజాత నియోజకవర్గంలో వేలు పెట్టడమేకాక, అవకాశం చిక్కినప్పుడల్లా చంద్రబాబుకు ఫిర్యాదులు చేయడం వల్లనే మంత్రి పదవికి దూరం అవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని సుజాత వర్గం గుర్తుచేస్తోంది. కలుపుకు పోవడం లేదు : ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే సుజాత పార్టీలో అందర్నీ కలుపుకు పోవడం లేదని కేవలం ఒక వర్గాన్నే ఆమె ప్రోత్సహిస్తున్నారని అసంతృప్త నాయకులు ఆరోపిస్తున్నారు. గత జూలైలో జంగారెడ్డిగూడెంలో టీడీపీ అసమ్మతి నాయకులు బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతలపూడి మండలంలో ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు ప్రగడవరం సమీపంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేయగా అధిష్టానం ఆదేశాలతో వెనక్కు తగ్గారు. 2014 ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్ధిని గెలిపించిన నిజమైన కార్యకర్తలకు పార్టీలో విలువ ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, నిస్పృహ ఆవహించిందని అంటున్నారు. ఇంత జరుగుతున్నా నియోజకవర్గ పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై తెలుగుదేశం అధిష్టానం మాత్రం ఇంత వరకు సీరియస్‌గా స్పందిం చలేదు. అసమ్మతి నాయకులు సమావేశం అయిన ప్రతిసారి పాలపొంగుపై నీళ్లు చల్లినట్లు జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఫోన్ చేసి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం అసమ్మతి నాయకులంతా వెనక్కు తగ్గడం పరిపాటిగా మారింది. పార్టీకి వ్యతిరేకంగా మీటింగులు పెడితే సహించను అంటూ పదేపదే చెప్పే పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నియోజకవర్గంలో ముదిరి పోతున్న వర్గపోరుపై ఎందుకు దృష్టి పెట్టడం లేదోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.