అయిననూ పోయిరావలె అమరావతికి
♦ పీతలపై అమీతుమీకి సిద్ధమవుతున్న అసమ్మతి నేతలు
♦ చింతలపూడి సెగ్మెంట్‌లో మాగంటి, పీతల మధ్య వర్గ పోరు
♦ ఆదివారం ఇన్‌చార్జ్ మంత్రి పత్తిపాటి సమక్షంలో పంచాయితీ
చింతలపూడి : చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి నిప్పు రాజుకుంటోంది. వారం రోజుల క్రితం ఏలూరు అతిథి హోటల్‌లో నాలుగు మండలాల ముఖ్య నేతలతో పాటు నాలుగు మండలాల జెడ్పీటీసీ సభ్యులు, పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు సమావేశమై స్థానిక శాసనసభ్యురాలు పీతల సుజాతపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే మరుసటి రోజు జంగారెడ్డిగూడెంలో వీరంతా సమావేశమై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయానికి రావడంతో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఫోన్ చేసి ఆదివారం అసమ్మతి నాయకులను అమరావతి రమ్మని సూచించడంతో తెలుగు తమ్ముళ్ల పంచాయితీ అమరావతికి చేరింది. అమరావతిలో కూడా సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే వారం చింతలపూడిలో జరిగే టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో
అసంతృప్తులంతా అమీతుమీకి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఏఎంసీ వేదికగా : నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరుకు ఏఎంసీ కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో మార్కెట్ కమిటీ పాలకవర్గాలన్నీ భర్తీ అయిపోయినా గత మూడున్నర ఏళ్లుగా చింతలపూడి ఏఎంసీ పాలకవర్గం మాత్రం భర్తీ చేయడం లేదు. ఏఎంసీ ఛైర్మన్ పదవిని తమవర్గానికి చెందిన వ్యక్తికి ఇప్పించుకోవడానికి ఎంపీ మాగంటి బాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. దానికి సుజాత చెక్ పెట్టడంతో ఎంపీ మాగంటి, ఎమ్మెల్యే సుజాత వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపధ్యంలోనే సుజాత మంత్రి పదవి పోవడానికి జిల్లాలోని ఒక బలమైన సామాజిక వర్గ నేతల ప్రమేయం ఉందనేది పీతల వర్గం ఆరోపణ. ఆమె మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఎంపీ మాగంటితో పాటు ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సుజాత నియోజకవర్గంలో వేలు పెట్టడమేకాక, అవకాశం చిక్కినప్పుడల్లా చంద్రబాబుకు ఫిర్యాదులు చేయడం వల్లనే మంత్రి పదవికి దూరం అవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని సుజాత వర్గం గుర్తుచేస్తోంది.
కలుపుకు పోవడం లేదు : ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే సుజాత పార్టీలో అందర్నీ కలుపుకు పోవడం లేదని కేవలం ఒక వర్గాన్నే ఆమె ప్రోత్సహిస్తున్నారని అసంతృప్త నాయకులు ఆరోపిస్తున్నారు. గత జూలైలో జంగారెడ్డిగూడెంలో టీడీపీ అసమ్మతి నాయకులు బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతలపూడి మండలంలో ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు ప్రగడవరం సమీపంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేయగా అధిష్టానం ఆదేశాలతో వెనక్కు తగ్గారు. 2014 ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్ధిని గెలిపించిన నిజమైన కార్యకర్తలకు పార్టీలో విలువ ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, నిస్పృహ ఆవహించిందని అంటున్నారు.
ఇంత జరుగుతున్నా నియోజకవర్గ పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై తెలుగుదేశం అధిష్టానం మాత్రం ఇంత వరకు సీరియస్‌గా స్పందిం చలేదు. అసమ్మతి నాయకులు సమావేశం అయిన ప్రతిసారి పాలపొంగుపై నీళ్లు చల్లినట్లు జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఫోన్ చేసి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం అసమ్మతి నాయకులంతా వెనక్కు తగ్గడం పరిపాటిగా మారింది. పార్టీకి వ్యతిరేకంగా మీటింగులు పెడితే సహించను అంటూ పదేపదే చెప్పే పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నియోజకవర్గంలో ముదిరి పోతున్న వర్గపోరుపై ఎందుకు దృష్టి పెట్టడం లేదోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.