పశ్చిమగోదావరి ,చింతలపూడి/జంగారెడ్డిగూడెం : మీవన్నీ ఉత్తుత్తి రాజీనామాలే. బ్లాక్‌మెయిల్ చేయడం కోసమే రాజీనామా డ్రామాకు తెరలేపారు. మాగంటి బాబు ఎంపీగా గెలిచాక చింతలపూడి నియోజకవర్గానికి చేసిందేమిటి? ఏఎంసీ విషయంలో ఎంపీ పెత్తనమేంటి, ఎంపీటీసీలను ప్రలోభపెట్టి బలవంతంగా రాజీనామాలు చేయించారు.. అంటూ చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత వర్గం ఎదురు దాడికి దిగింది. పీతల సుజాత వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం ఇద్దరు జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీటీసీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పీతల సుజాత వర్గం తీవ్రంగా స్పందిం చింది. చింతలపూడి, జంగారెడ్డిగూడేలలో ఆ వర్గం నేతలు విలేకరులతో మాట్లాడారు.
చింతలపూడి ఎంపీపీ దాసరి రామక్క, పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతూ ఎంపీ మాగంటి బాబు వర్గం నియోజకవర్గంపై పెత్తనం కోసం కావాలనే రాజీనామాల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కొందరు కావాలని పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని ఆరోపించారు. రాజీనామాలతో ఎమ్మెల్యే సుజాతను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్నారు. మార్కెట్ కమిటీ నియామకంలో ఎంపీ మాగంటి జోక్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మాగంటి వల్లే ఇక్కడ గ్రూపులు తలెత్తాయన్నారు. సమస్యను పరిష్కరించకపోతే చంద్రబాబును కలిసి ఎంపీ వర్గంపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎంపీటీసీలు ఎం.సుందరమ్మ, కె.వీర్రాజు, వెలగం సత్యవతి, మిండా ప్రకాశం, కృపాబాయమ్మ, కొండపల్లి సరస్వతి, టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు, బి.ఆశీర్వాదం, సీనియర్ నాయకులు పొట్టి విశ్వేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కౌన్సి లర్ నంబూరి రామచంద్రరాజు ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ముస్తఫా, చెరుకూరి శ్రీధర్ కౌన్సిలర్లు సీహెచ్ రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్, తూటికుంట దుర్గారావు, మండల కో–ఆప్షన్ సభ్యులు ఎస్‌ఎస్ ఇస్మాయేల్ తదితరులు మాట్లాడుతూ కేవలం ఏలూరు ఎంపీ మాగంటి బాబు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వలనే ఇక్కడ విభేదాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. వీరు గిరిజన, దళిత ఎమ్మెల్యేలపై గతంలో కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇంత వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించే వ్యక్తి కనీసం ఎమ్మెల్యేను కలవలేదన్నారు. రూరల్ కమిటీ అధ్యక్షులు దాకారపు గోపాలకృష్ణ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఉమ్మడి రాంబా బు, సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, పగ డం దినేష్, తూటికుంట రాము, యాకూబ్, కౌన్సి లర్ చాబత్తుల మరియ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
మీవన్నీ ఉత్తుత్తి రాజీనామాలే...
Published Wed, Sep 27 2017 9:45 AM | Last Updated on Wed, Sep 27 2017 9:45 AM
Advertisement
Advertisement