చింతలపూడి నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు క్లయిమాక్స్‌కు చేరాయి. ఎమ్మెల్యే పీతల సుజాత వైఖరిని నిరసిస్తూ ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు, 17 మంది ఎంపీటీసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయగా, మంగళవారం మరికొంతమంది రాజీనామాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు ఈ సమస్యను పరిష్కరించకుండా నానుస్తుండటంతో విసిగిపోయిన నేతలు రాజీనామా పర్వానికి తెరలేపారు. అయితే ఈ రాజీనామాలు ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో ఇది మరో డ్రామాగా మిగిలిపోనుందని తెలుస్తోంది.
పశ్చిమగోదావరి , సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎమ్మెల్యే పీతల సుజాత, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్ నియామకంపై మూడున్నర ఏళ్లుగా జరుగుతున్న వివాదానికి తెరపడకపోవడంతో ఆ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఏఎంసీ ఛైర్మన్ నియామకం విషయంలో రగిలిన విభేదాలు ఇరువర్గాల మధ్య పూడ్చలేని అగాధంగా మారాయి. ఇరువర్గాలు
టీడీపీలో ముదిరిన సంక్షోభం
ప్రజాసేవను పక్కన పెట్టి రాజకీయ పదవుల కోసం పోటీ పడుతూ రోడ్డెక్కుతున్నారు. గత వారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు వచ్చిన సందర్భంలో జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో ఎంపీ వర్గం రాజీనామాలు చేస్తామని బెదిరించింది. వారితో మాట్లాడుతున్న మరో మంత్రి పితాని సత్యనారాయణ సహనం కోల్పోయి చేతనైంది చేసుకోండనడంతో వివాదం ముదిరింది. ఇరువర్గాలను కూర్చోబెట్టి రాజీ చేయాలన్న ప్రయత్నానికి పీతల సుజాత వర్గం కలిసి రాలేదు. దీంతో కామవరపుకోట, చింతలపూడి జెడ్పీటీసీలు గంటా సుధీర్‌బాబు, తాళ్లూరి రాధారాణితో పాటు చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట మండలాలకు చెందిన 17 మంది ఎంపీటీసీలు తమ రాజీనామా లేఖలను జెడ్పీ సీఈవోకి సమర్పించారు. తమను పూర్తిగా విస్మరించడం వల్లే తాము రాజీనామాలు చేయాల్సి వచ్చిందని ఎంపీ మాగంటి బాబు వర్గం చెబుతోంది.
తమకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదని, పనులు కాకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని వారు ఆరోపించారు. ఇనన్‌ఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇరువర్గాలను కూర్చుని చర్చించుకోమని చెప్పడంతో రాత్రి 11 గంటల వరకూ తాము వేచి చూసినా ఎమ్మెల్యే సుజాత రాకపోవడం వల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చామని కామవరపుకోట జెడ్పీటీసీ ఘంటా సుధీర్‌బాబు, చింతలపూడి జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి మీడియాకి తెలిపారు. ఎన్నికలకు కేవలం 13 రోజుల ముందు నియోజకవర్గానికి వచ్చినా తామంతా దగ్గరుండి కష్టపడి గెలిపించామని, ఎమ్మెల్యే మాత్రం తమను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మరోవైపు పీతల సుజాత వర్గం మాత్రం దళిత మహిళ కావడంతో మొదటి నుంచి అమెకు విలువ లేకుండా వ్యవహరిస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పదేపదే నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కావాలని పార్టీ పరువును వీధికి లాగుతున్నారని ఆరోపిస్తున్నారు.