టీడీపీలో 'వర్ణ వివక్ష'! | internal clashes in west godavari TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో 'వర్ణ వివక్ష'!

Published Tue, Dec 8 2015 10:13 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

టీడీపీలో 'వర్ణ వివక్ష'! - Sakshi

టీడీపీలో 'వర్ణ వివక్ష'!

దళిత, గిరిజన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన ఎంపీ మాగంటి
మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌లపై కక్ష
చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో
మాగంటి పెత్తనంపై టీడీపీ వర్గాల్లో అసహనం
పార్టీ అధినేత చంద్రబాబు ఎదుట నేడు పంచాయితీ!

 
ఏలూరు : తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు పరాకాష్టకు చేరుతున్నాయి. జిల్లాలోని దళిత, గిరిజన ఎమ్మెల్యేలు వర్ణ వివక్షకు గురవుతున్నారు. వివక్షను తట్టుకోలేకపోతున్న ఆయా సామాజిక వర్గాల నేతలు ఇటీవల చోటుచోసుకున్న ఘటనలను మంగళవారం జిల్లాకు వస్తున్న పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. దళిత వర్గానికి చెందిన చింతలపూడి ఎమ్మెల్యే, మంత్రి పీతల సుజాత, ఎస్టీ వర్గానికి చెందిన పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఏలూరు ఎంపీ మాగంటి బాబు కక్షపూరిత రాజకీయాలు నెరపుతున్నారనేది ఆయావర్గాల ప్రధాన ఆరోపణ.
 
ఆ ఇద్దరే ఎందుకు
ఎంపీగా మాగంటి బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూ రు లోక్‌సభ నియోజకవర్గ పరధిలో ఏలూరు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి వ్యవహారాల జోలికి పోని ఎంపీ మాగంటి చీటికీమాటికీ చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో పాలన, పార్టీ వ్యవరాహాల్లో తలదూరుస్తుంటారన్న ఆరోపణ బలంగా ఉంది.

మూడురోజుల క్రితం కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఎంపీ మాగంటి బాబు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను పొగుడుతూ.. ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను విమర్శించడం కలకలం రేపుతోంది. గిరిజన ఎమ్మెల్యే కాబట్టే మొడియం శ్రీనివాస్‌ను ఎంపీ చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
మొడియంతో కయ్యం ఎక్కడ మొదలైందంటే..

ఎంపీ మాగంటి ఆధిపత్య భావజాలాన్ని పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ మొదట్లో భరించినా క్రమంగా ఎదురు తిరుగుతూ వచ్చారు. దీంతో ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన ఎంపీ మాగంటి ఆ నియోజకవర్గంలో పూర్తిస్థాయి పెత్తనం మొదలుపెట్టారు. సబ్‌స్టేషన్ల పరిధిలో ట్రాన్స్‌కో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో ఎమ్మె ల్యే సిఫార్సు చేసిన వారికి ఉద్యోగాలు రాకుండా ఎంపీ అడ్డుపడ్డారన్న వాదనలు ఉన్నాయి.
 
అప్పటినుంచి ఇరువర్గాల మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత ఇసుక ర్యాంపుల నుంచి వచ్చే ఆదాయం వాటాల్లోనూ ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదరలేదని సమాచారం. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా రూ.కోట్లు విలువైన పనులను ఎమ్మె ల్యే వర్గీయులే చేజిక్కించుకోవడంతో ఎంపీ వర్గీయులకు మింగుడు పడలేదు.

మొత్తంగా ఎమ్మెల్యే మొడియం తనను లెక్కచేయడం లేదని అసహనం ప్రదర్శించిన ఎంపీ మాగంటి గత శనివారం కన్నాపురంలో ఎమ్మెల్యేపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఎంపీ చేసిన వ్యాఖలపై గిరిజన సంక్షేమ సంఘాల నాయకులు ఆందోళన చేయడానికి  సిద్ధపడ్డారు. అయితే ఎంపీ వ్యవహారాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకు వెళదా మని మొడియం వర్గీయులు చెప్పడంతో గిరిజన నేతలు ఆ ప్రతిపాదన విరమించారు.
 
మంత్రి సుజాత ఇలాకాలో..
జిల్లాకు చెందిన మహిళా మంత్రి పీతల సుజాత ప్రాతి నిధ్యం వహిస్తున్న చింతలపూడిలోనూ ఎంపీ గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారనే ఆరోపణ బలంగా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ల ఎంపిక పూర్తయి నెలలు కావస్తుండగా, ఇప్పటికీ చింతలపూడిలో మాత్రం పూర్తికాలేదు.

కేవలం ఎంపీ మాగం టి అడ్డుపడటంతోనే ఎంపిక ఆగిందనేది నియోజకవర్గంలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. పీతల సుజాత తన వర్గానికి చెందిన చిన్నంశెట్టి సీతారామయ్యకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని భావించగా, మాగంటి బాబు వర్గీయులు కామవరపుకోటకు చెందిన కోనేరు సుబ్బారావు పేరును తెరపైకి తీసుకువచ్చారు. దీంతో ఈ విషయం ఎటూతేలక పెండింగ్ పడింది.
 
చింతలపూడి నియోజకవర్గంలో ట్రాన్స్‌కో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లోనూ మంత్రి పీతల సిఫార్సు చేసిన వారిలో ఒక్కరికి కూడా ఉద్యోగం రాకుండా ఎంపీ వర్గం అడ్డుపడిందన్న వాదనలున్నాయి. కనీసం మహిళా మంత్రి అనే కనికరం కూడా లేకుండా తమ నేతను మాగంటి చిన్నచూపు చూస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని సుజాత వర్గీయులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొడియం శ్రీనివాస్ వర్గీయులతో కలిసి ఎంపీ మాగంటి వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి వర్గీయులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement